Himachal Pradesh | హైదరాబాద్, ఫిబ్రవరి 17 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): ఎన్నికల్లో ఆర్భాటపు గ్యారెంటీలను గుప్పించడం.. ఆనక అధికారంలోకి వచ్చాక హామీల అమలును మరిచిపోవడం కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ రాష్ట్ర ప్రభుత్వాలకు అలవాటుగా మారిపోయింది. కర్ణాటక, తెలంగాణలో చేసినట్టే హిమాచల్ ప్రదేశ్‌లోనూ ఇచ్చిన హామీలను గాలికొదిలేసింది హస్తం పార్టీ. అధికారంలోకి వచ్చి దాదాపుగా 15 నెలలు కావొస్తున్నా.. ఎన్నికల సమయంలో ఇచ్చిన 10 గ్యారెంటీల అమలుపై చిత్తశుధ్ధితో వ్యవహరించట్లేదు. దీంతో ‘కాంగ్రెస్‌కు ఎందుకు ఓటేశామా?’ అని అక్కడి ప్రజలు మండిపడుతున్నారు.
2022 డిసెంబర్లో హిమాచల్‌ప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన 10 ప్రధాన హామీలను ఇప్పటికీ అమలు చేయట్లేదు. మహిళలకు నెలకు రూ.1,500 చొప్పున జీవన భృతి చెల్లిస్తామని, 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు సరఫరా చేస్తామని, పాడి రైతుల దగ్గర ఆవు పాలను లీటరు రూ.80 చొప్పున, బర్రె పాలు లీటరు రూ.100 చొప్పున కొనుగోలు చేస్తామంటూ ఎన్నికల సమయంలో ఊదరగొట్టింది. ఆఖరుకు ఆవు పేడను కూడా కిలో రూ.2 చొప్పున కొనుగోలు చేస్తామని, 5 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చింది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత వీటిలో ఏ ఒక్కదాన్ని కూడా ప్రభుత్వం అమలులోకి తీసుకురాలేదు. పగ్గాలు చేపట్టిన వెంటనే.. 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును సరఫరా చేయడం పక్కకు పెట్టిన కాంగ్రెస్.. విద్యుత్తు చార్జీలు యూనిట్‌కు 86 పైసలు చొప్పున పెంచింది. అంతేకాకుండా, జలవిద్యుత్తు కేంద్రాల మీద జలవినియోగ పన్ను విధించింది. దీంతో ఈ భారం అంతిమంగా వినియోగదారులపైనే పడింది. దీనిపై ఆగ్రహించిన హక్కుల కార్యకర్తలు ఉచిత విద్యుత్తు హామీని ఎప్పుడు నెరవేరుస్తారని సర్కారును నిలదీశారు. ‘ఇంకా సమయం ఉందిగా.. మరో మూడేండ్లలో అమలు చేస్తాంలే’ అంటూ సాక్షాత్తూ ముఖ్యమ్రంతి సుఖ్విందర్ సింగ్ ఏకంగా రాష్ట్ర శాసన సభలోనే చెప్పారు.
రాష్ట్రంలో 2.35 లక్షల మంది మహిళలకు నెలకు రూ. 1,500 చొప్పున భృతిని చెల్లిస్తామని ఊరించిన కాంగ్రెస్ పార్టీ.. చివరకు లాహల్ స్పితి అనే ఒకే ఒక్క జిల్లాలో ఓ మారుమూల ప్రాంతానికి మాత్రమే ఈ పథకాన్ని పరిమితం చేసింది. అదీ పైలట్ ప్రాజెక్టుగా కేవలం 9 వేల మంది మహిళలకే స్కీమ్‌ను కొన్ని నెలల పాటు వర్తింపజేసింది. ఆవులు, బర్రె పాల ధర పెంపు విషయంలోనూ కాంగ్రెస్ మాట తప్పింది. ఆవు పేడ కొనుగోలునూ ప్రకటనలకే పరిమితం చేసింది. పాత పింఛను విధానం పునరుద్ధరణ హామీని తప్పింది. 5 లక్షల ఉద్యోగాల భర్తీని గాలికొదిలేసి, రిక్రూట్‌మెంట్‌నే నిలిపేసింది. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణను మరిచింది. డ్రగ్స్‌పై ఉక్కుపాదం, ఉద్యోగులకు 14 శాతం డీఏ, ఆపిల్ సాగుదారులకే ధరల నిర్ణయాధికారం వంటి హామీలను తుంగలో తొక్కింది. యువతకు రూ.680 కోట్ల స్టార్టప్ ఫండ్ స్కీమ్ ఇంకా ప్రారంభమే కాలేదు. వడ్డీలేని రుణాలుతో పాటు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 4 ఇంగ్లిష్ మీడియం పాఠశాలలు, సంచార వాహనాలతో ప్రతి గ్రామానికి వైద్య సౌకర్యం ఇలా అన్ని హామీలను అటకెక్కించింది. దీంతో కాంగ్రెస్ వైఖరిపై ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి.
అధికారంలోకి వచ్చీరాగానే పది గ్యారెంటీలను అమల్లోకి తీసుకొస్తామన్నారు. ఒక్క హామీని కూడా ఇప్పటికీ నెరవేర్చలేదు. అయినప్పటికీ, మూడు గ్యారెంటీలను పూర్తిచేసినట్టు కాంగ్రెస్ సర్కారు ప్రజలను మభ్యపెడుతున్నది.
– రణ్‌ధీర్ శర్మ, బీజేపీ ప్రతినిధి