Madhya Pradesh Assembly Polls | మధ్యప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల వేడి పుంజుకుంటున్నది. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ పోటాపోటీగా ప్రచారం నిర్వహించి విజయం సాధించాలని తలపోస్తున్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందినా.. తమ ఎమ్మెల్యేల ఫిరాయింపులను ప్రోత్సహించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీపై ప్రతీకారం తీర్చుకునేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతున్నది. తిరిగి అధికారాన్ని కాపాడుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నది.
సుదీర్ఘకాలంగా సీఎంగా ఉన్న శివరాజ్ సింగ్ చౌహాన్ పట్ల ప్రజల్లో వ్యతిరేకతను గుర్తించిన బీజేపీ అధి నాయకత్వం అప్రమత్తమైంది. ముగ్గురు కేంద్ర మంత్రులు, నలుగురు పార్లమెంట్ సభ్యులు, పార్టీ ప్రధాన కార్యదర్శిని ఎన్నికల బరిలో నిలిపింది. తద్వారా సీఎం అభ్యర్థిగా శివరాజ్ సింగ్ చౌహాన్ ను నిలిపేందుకు బీజేపీ హై కమాండ్ సిద్ధంగా లేదని సమాచారం. ఈ ఎన్నికల్లో గెలుపొందితే కేంద్ర మంత్రులు-ఎంపీలు- జాతీయ నేతల్లో ఒకరికి సీఎం బాధ్యతలు అప్పగించాలని బీజేపీ నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తున్నది.
అధికార బీజేపీ నేతలు చేపట్టే జన ఆశీర్వాద యాత్రల్లో హిందూత్వ వాదంతో ప్రచారంలోకి దూసుకెళ్తోంది. విపక్ష ‘ఇండియా’ కూటమి నేతల వ్యాఖ్యలను అడ్డం పెట్టుకుని హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. సనాతన ధర్మాన్ని ఇండియా కూటమి ధ్వంసం చేయాలని చూస్తోందంటూ ప్రధాని మోదీ స్వయంగా వ్యాఖ్యానించారు. ఉజ్జయినిలోని మహాకాళ్ లోక్ కారిడార్, ఓంకారేశ్వర్ లో ఆది శంకరాచార్యుల విగ్రహం ద్వారా ప్రజలను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నది.
ఇటు విపక్ష కాంగ్రెస్ పార్టీ ‘హిందూత్వ’కు వ్యతిరేకం కాదని ప్రచారం చేస్తుంది. కాంగ్రెస్ సీఎం అభ్యర్థి కమల్ నాథ్ తాను హనుమంతుడి భక్తుడినని చెబుతున్నారు. తన స్వస్థలంలో హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపనతోపాటు భజరంగ్ దళ్ ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్రంలో ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
మధ్యప్రదేశ్ రాష్ట్ర జనాభాలో ఓబీసీలు సుమారు 50 శాతం.. వీరంతా గతంలో బీజేపీకి అనుకూలంగా ఉన్నారు. శివరాజ్ సింగ్ చౌహాన్ కు ముందు సీఎంగా పని చేసిన ఉమా భారతి, బాబూ లాల్ గౌర్ ఓబీసీ నేతలే. ప్రధాని నరేంద్రమోదీ కూడా ఓబీసీ కావడంతో బీజేపీకి కలిసి వచ్చే అంశం.. కానీ తాము అధికారంలోకి వస్తే కుల గణన చేపడతామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. మహిళా రిజర్వేషన్లలోనూ ఓబీసీ కోటా అమలు చేస్తామని తెలిపింది.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 5.52 కోట్ల మంది ఓటర్లు ఉంటే వారిలో మహిళలు 2.67 కోట్ల మంది ఉన్నారు. వారిని ఆకట్టుకోవడానికి అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తున్నాయి. ఇటీవల ఉజ్జయిని ప్రాంతంలో మైనర్ బాలికపై జరిగిన లైంగిక దాడి, సాయం కోసం ఆమె ఇంటింటికి తిరిగిన పరిస్థితిని కాంగ్రెస్ పార్టీ అస్త్రంగా వాడుకుంటున్నది. ఇంకా మహిళా అనుకూల పథకాలు తేస్తామని హామీ ఇస్తున్నది. బీజేపీ తమకు తిరిగి అధికారం అప్పగిస్తే ప్రభుత్వోద్యోగాల్లో మహిళలకు 35 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెబుతున్నది.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని 230 అసెంబ్లీ స్థానాల్లో 47 సెగ్మెంట్లను ఎస్టీలకు కేటాయించారు. రాష్ట్రంలో వారి జనాభా 21 శాతం. కాగా, గత ఎన్నికల్లో బీజేపీ 16, కాంగ్రెస్ 31 స్థానాలు గెలుచుకున్నాయి. దీంతో బీజేపీ ఆదివాసీల మద్దతు కూడగట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. అక్టోబర్ ఐదో తేదీన రాణి దుర్గావతి 500వ జయంతి ఉత్సవాలను ప్రధాని మోదీ ఆధ్వర్యంలో నిర్వహించారు. బీజేపీ హయాంలో ఎస్టీలపై దౌర్జన్యాలను కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ప్రస్తావిస్తున్నది.
బుందేల్ ఖండ్, గ్వాలియర్-చంబల్, వింద్య ప్రాంతాల సెగ్మెంట్లలో ఎస్సీల ఓట్లే ప్రధానం. రాష్ట్ర జనాభాలో 17 శాతం మంది ఎస్సీలే ఉన్నారు. మొత్తం సీట్లలో 35 స్థానాలను ఎస్సీలకు కేటాయించారు. గత ఎన్నికల్లో బీజేపీ 18, కాంగ్రెస్ 17 స్థానాల్లో గెలుపొందింది. ఎస్సీ ప్రముఖుల వేడుకల నిర్వహణ ద్వారా వారికి దగ్గర కావడానికి బీజేపీ.. ఎస్సీలపై దౌర్జన్యాలను కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది.
కర్ణాటకలో మాదిరిగానే మధ్యప్రదేశ్ లోని శివరాజ్ సింగ్ చౌహాన్ సర్కార్ అవినీతికి పాల్పడిందంటూ కాంగ్రెస్ ఆరోపణలు చేస్తోంది. చౌహాన్ 50 శాతం కమీషన్ సర్కార్ అంటూ కమల్నాథ్తోపాటు కాంగ్రెస్ నేతలంతా చెబుతున్నారు. ఒక సభలో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ మాట్లాడుతూ 18 ఏండ్ల బీజేపీ పాలనలో 250 కుంభకోణాలు జరిగాయని ఆరోపించారు. కాంగ్రెస్ నేతల కుంభకోణాలు రూ.20 లక్షల కోట్ల పై చిలుకే ఉంటాయంటూ ప్రధాని మోదీ గత జూన్ లో భోపాల్ లో జరిగిన ఓ సమావేశంలో చెప్పారు.
రాష్ట్ర జనాభాలో 70 శాతం మంది అన్నదాతలే. పంటలకు గిట్టుబాటు ధర, పెట్టుబడి, వాతావరణ మార్పులు, వసతుల లేమి తదితర సమస్యలతో వారు బాధ పడుతున్నారు. వారిని తమ వైపుకు తిప్పుకోవడానికి బీజేపీ, కాంగ్రెస్ పార్టీ తీవ్రంగానే ప్రయత్నిస్తున్నాయి. 2017లో మందసౌర్ లో నిరసన తెలుపుతున్న రైతులపై పోలీసుల కాల్పులను కాంగ్రెస్ పార్టీ తనకు అనుకూలంగా మార్చుకున్నది. రూ.2 లక్షల రుణ మాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ప్రకటించింది.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య వెంటాడుతున్నది. గత మార్చిలో వచ్చిన సర్వే ప్రకారం రాష్ట్రంలో 39,93,149 మంది యువకులు ఉపాధి కల్పనా కేంద్రాల్లో తమ పేర్లు రిజిస్టర్ చేసుకున్నారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో 10,298 మంది విద్యార్థులు, 6,999 మంది నిరుద్యోగ యువకులు ఆత్మహత్యకు పాల్పడ్డారని కాంగ్రెస్ ఆరోపణ. నిరుద్యోగం ప్రభావం తగ్గించుకోవడానికి ‘లెర్న్ అండ్ ఎర్న్’ అనే కార్యక్రమాలు చేపట్టింది బీజేపీ.. గత మూడేండ్లలో 61 వేల ఉద్యోగాలు కల్పించామని చెబుతున్నా.. కాంగ్రెస్ పార్టీ కేవలం 21 ఉద్యోగాలే వచ్చాయని వాదిస్తోంది.
మూడేండ్ల క్రితం కాంగ్రెస్ పార్టీ నుంచి తనతోపాటు బీజేపీలో చేరిన తన మద్దతుదారులందరికీ టికెట్లు సంపాదించడం కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ముందు ఉన్న సవాల్. వారందరికీ తిరిగి టికెట్లు ఇవ్వడం వల్ల తొలి నుంచి అంకిత భావంతో పని చేసే బీజేపీ నేతలు, కార్యకర్తల నుంచి అసమ్మతి వ్యక్తం అవుతుందన్న భయాలు ఉన్నాయి.
విపక్ష కాంగ్రెస్ పార్టీ తమ సీఎం అభ్యర్థి కమల్ నాథ్ అని ప్రకటించింది. కానీ బీజేపీ స్పష్టమైన ప్రకటన చేయలేదు. రాష్ట్రంలోని ప్రముఖ నేతల్లో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఒకరు. రాష్ట్రంలో విద్యా వైద్య వసతుల కల్పన కీలకం. కునో నేషనల్ పార్క్లో చిరుతపులుల మరణాలు అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారాయన్న విమర్శలు ఉన్నాయి.