ఉజ్జయిని : మధ్యప్రదేశ్ డీజీపీ కైలాశ్ మక్వానా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బాలికలు, మహిళలపై లైంగిక దాడులను కేవలం పోలీసులే ఆపలేరని చెప్పారు. ఈ రోజుల్లో ఇంటర్నెట్, సెల్ఫోన్లు, మద్యం, అశ్లీల చిత్రాలు అందరికీ అందుబాటులో ఉంటున్నాయని, సమాజంలో నైతిక విలువలు క్షీణిస్తున్నాయని వ్యాఖ్యానించారు.
ఉజ్జయినిలో జరిగిన డివిజినల్ సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. లైంగిక దాడులు పెరగడానికి కారణం ఏమిటని విలేకర్లు ప్రశ్నించినపుడు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంటర్నెట్ ద్వారా వ్యాపిస్తున్న అశ్లీలత పసి మనసులను తప్పుదారి పట్టిస్తున్నదన్నారు.