Madhya Pradesh | రోజువారీ కూలీగా జీవనం సాగిస్తున్న ఓ ఆదివాసీ యువకుడిపై ఓ వ్యక్తి మూత్రం పోశాడు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్లోని సిధి జిల్లాలో చోటు చేసుకున్నది. ఈ ఘటన ఎప్పుడు జరిగిందన్న సంగతి తెలియదు గానీ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నది. ఈ ఘటన విషయమై రాష్ట్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీతోపాటు విపక్ష పార్టీలు మండి పడుతున్నాయి.
‘ప్రభుత్వానికి ఈ దారుణం కనిపించలేదా? ఇంతవరకు నేరస్థుడిని ఎందుకు అరెస్ట్ చేయలేదు’ అని సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నలు సంధిస్తున్నారు. నిందితుడు అధికార బీజేపీ ఎమ్మెల్యే సన్నిహితుడైనందు వల్లే, ఆ వ్యక్తిని అరెస్ట్ చేయలేదని కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పిస్తున్నది.
సోషల్ మీడియాలో వైరలైన ఈ వీడియో తన ద్రుష్టికి వచ్చిందని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. సంబంధిత నేరస్తుడిని వెంటనే అరెస్ట్ చేయాలని, తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించానని పేర్కొన్నారు. జాతీయ భద్రతా చట్టం (ఎన్ఎస్ఏ) కింద కేసు నమోదు చేయాలని ఆదేశించినట్లు తెలిపారు.
మాజీ సీఎం కమల్ నాథ్ స్పందిస్తూ.. ఇటువంటి హేయమైన చర్యలకు నాగరిక సమాజంలో చోటు లేదన్నారు. ఆదివాసీ సంఘాలు నిరసనలకు దిగడంతో పోలీసులు కూడా స్పందించారు. సీఎం శివరాజ్ సింగ్ ఆదేశాల మేరకు నిందితుడిపై ఐపీసీలోని 294, 504 సెక్షన్లతోపాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్, జాతీయ భద్రతాచట్టం కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.