సాగర్: మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే(BJP MLA) బ్రిజ్ బిహారీ పటేరియా .. స్పీకర్‌కు రాజీనామా సమర్పించి ఆ తర్వాత మళ్లీ దాన్ని వెనక్కి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. డియోరి నియోజకవర్గంలో ఓ వ్యక్తి పాము కాటుతో మృతిచెందాడు. అయితే అతనికి డెత్ సర్టిఫికేట్ ఇచ్చేందుకు ఓ డాక్టర్ లంచం డిమాండ్ చేశాడు. ఈ నేపథ్యంలో ఆ డాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆ ఎమ్మెల్యే కేస్లీ పోలీసు స్టేషన్ ముందు నిరసన చేపట్టాడు. గురువారం రాత్రి 11 నుంచి 12.30 వరకు ఆ ఎమ్మెల్యే పోలీసు స్టేషన్ ముందు బైఠాయించాడు. డిమాండ్లను పరిశీలిస్తామని హామీ ఇచ్చిన తర్వాత ఆయన ధర్నా విరమించారు.
ధర్నా చేస్తున్న ఎవరూ పట్టించుకోలేదని, అందుకే ఆవేశంలో రాజీనామా చేశానని, కానీ మళ్లీ ఆ రాజీనామాను వెనక్కి తీసుకున్నట్లు ఆ ఎమ్మెల్యే తెలిపారు. ఓ పేదవాడు ఓ డాక్టర్‌పై ఫిర్యాదు ఇచ్చాడని, ఆ ఫిర్యాదుపై విచారణ చేపట్టాల్సిన బాధ్యత పోలీసులదే అని ఎమ్మెల్యే తెలిపారు. 70 ఏళ్ల వృద్ధుడి కొడుకు పాము కాటు వల్ల మరణించాడని, అతనికి మరణద్రువీకరణ పత్రం ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేసినట్లు డాక్టర్‌పై ఆరోపణలు ఉన్నాయి. ఆ డాక్టర్ 40 వేల లంచం అడిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.
పాము కాటుతో మృతిచెందిన కుటుంబసభ్యులకు 4 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తామని, దాంట్లో పది శాతం ఆ డాక్టర్ లంచంగా డిమాండ్ చేసినట్లు ఎమ్మెల్యే ఆరోపించారు. పది వేలు ఇచ్చేందుకు సిద్దమైనా ఆ డాక్టర్ అదనపు అమౌంట్ కోసం వత్తిడి చేసినట్లు తెలిపారు.