భోపాల్, జూన్ 6: బీజేపీ నేతృత్వంలోని మధ్యప్రదేశ్ ప్రభుత్వంలో భారీ స్థాయిలో జీతాల కుంభకోణానికి స్కెచ్ వేశారా? లేని ఉద్యోగులను ఉన్నట్లుగా సృష్టించి వారి పేరున జీతాలు స్వాహా చేయడానికి కుట్ర జరిగిందా? ఈ ప్రశ్నలకు ఔననే సమాధానం వినిపిస్తున్నది. మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన 50,000 మంది ఉద్యోగులకు గత ఆరు నెలలుగా ప్రభుత్వం జీతాలు చెల్లించడం లేదు. మధ్యప్రదేశ్ ప్రభుత్వంలో పని చేస్తున్న మొత్తం ఉద్యోగుల సంఖ్యలో 9 శాతం ఉండే ఈ 50 వేల మంది ప్రభుత్వ ఉద్యోగుల ఉనికిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ మధ్యప్రదేశ్ చరిత్రలోనే ఇది అతి పెద్ద జీతాల కుంభకోణంగా బయటపడే అవకాశం కనపడుతున్నది.
అధికారిక దస్ర్తాలలో కనిపిస్తున్న ఈ ఉద్యోగులకు సంబంధించిన పత్రాలను ఎన్డీటీవీ సేకరించింది. ప్రతి ఉద్యోగి పేరు, ఎంప్లాయీ కోడ్ ఆ దస్ర్తాలలో ఉంది. అయితే గడచిన ఆరు నెలలుగా వారికి జీతాలను చెల్లించే ప్రక్రియ మాత్రం జరగలేదు. రూ. 230 కోట్ల అవినీతి జరగడానికి ఆస్కారం ఉన్న ఈ కుంభకోణంపై ఈ ఖాతాలకు జీతాలు ఇప్పటి వరకు వెళ్లలేదని తాను కచ్చితంగా చెప్పగలనని, దీనిపై తాము వెంటనే చర్యలు తీసుకున్నామని కమిషనర్ ఆఫ్ ట్రెజరీ అకౌంట్స్ భాస్కర్ లక్ష్కర్ ఎన్డీటీవీకి తెలిపారు.