mAadhaar : ఆధార్ కార్డ్‌లో వివరాల అప్డేట్ కోసం ప్రస్తుతం ఎక్కువ మంది వాడుతున్నది ఎంఆధార్ యాప్. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఈ యాప్ ద్వారా ఆధార్‌లో వివరాలు మార్పు చేసుకోవచ్చు. కానీ, త్వరలో ఈ యాప్ పని చేయదు. ఎంఆధార్ యాప్ త్వరలో పనిచేయబోదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీని స్థానంలో వినియోగదారులు కొత్త ఆధార్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు ఆధార్ సంస్థ యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐఏడీఏఐ).. ఎక్స్ వేదికగా ఒక ప్రకటన విడుదల చేసింది.
‘‘ఎంఆధార్ త్వరలో నిలిచిపోనుంది. కొత్త ఆధార్ యాప్ డౌన్లోడ్ చేసుకుని వేగవంతమైన, స్మార్ట్ ఫీచర్లను చేతి వేళ్లతోనే యాక్సెస్ చేయండి. మరింత సులభంగా, సౌకర్యవంతంగా ఉండేలా కొత్త యాప్ రూపొందింది. కొత్త ఆధార్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి” అంటూ తన పోస్ట్‌లో పేర్కొంది. కొత్త యాప్ మరింత వేగవంతంగా పని చేయనుంది. ఇందులో లేటెస్ట్ స్మార్ట్ ఫీచర్లు యాడ్ అయ్యాయి. క్యూఆర్ బేస్డ్ ఆధార్ షేరింగ్ ఫీచర్ ఉంది. దీని ద్వారా హోటళ్లు, హాస్పిటళ్లు, ప్రభుత్వ ఆఫీసులలో ఈ ఫీచర్ వాడుకోవచ్చు. ఆధార్‌లో ఉండే పూర్తి వివరాల్ని షేర్ చేయకుండా.. అవసరమైన వాటిని మాత్రమే క్యూఆర్ కోడ్ వెరిఫికేషన్ ద్వారా షేర్ చేయొచ్చు. అథెంటిఫికేషన్ సిస్టమ్ కూడా మారింది.
ఇంతకుముందు మొబైల్ నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపి, ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వాల్సి వచ్చేది. కానీ, కొత్త విధానంలో మరింత భద్రతతో కూడిన అథెంటికేషన్ ఏర్పాటు చేశారు. దీనిలో ఓటీపీతోపాటు ఫేస్ అథెంటికేషన్, క్యూఆర్ వెరిఫికేషన్ కూడా ఇస్తేనే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. దీనివల్ల ఆధార్ దుర్వినియోగం కాకుండా ఉంటుంది. బయోమెట్రిక్ ఇన్ఫర్మేషన్ను లాక్ చేసుకోవచ్చు. ఫింగర్‌ప్రింట్, ఫేస్, ఐరిస్ వంటి డాటాను ఇతరులు యాక్సెస్ చేయకుండా లాక్ చేసుకోవచ్చు. ప్లేస్టోర్, ఐస్టోర్ నుంచి కొత్త ఆధార్ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఓటపీ, ఫేస్ ఐడీ ద్వారా లాగిన్ కావొచ్చు. పిన్ సహా మల్టీ లేయర్స్‌లో లాగిన్‌కు అవకాశం ఉంది. ఇక జూన్ 14, 2027 వరకు ఎలాంటి ఫీజు చెల్లించకుండానే ఆధార్‌లో వినియోగదారులు మార్పులు చేసుకోవచ్చు.