కోల్‌కతా: చిప్స్ ప్యాకెట్ దొంగిలించాడన్న ఆరోపణలతో షాపు యజమాని బాలుడ్ని తిట్టి కొట్టాడు. అతడి తల్లిని కూడా పిలిపించి తిట్టాడు. మనస్తాపం చెందిన బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ‘అమ్మా నేను చిప్స్ దొంగిలించలేదు’ అని సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. (Maa, I didn’t steal chips) పశ్చిమ బెంగాల్‌లోని పశ్చిమ మెదినీపూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పన్స్కురా ప్రాంతానికి చెందిన 12 ఏళ్ల కృష్ణేందు దాస్ 7వ తరగతి చదువుతున్నాడు. గురువారం సాయంత్రం చిప్స్ ప్యాకెట్ కొనేందుకు శుభాంకర్ దీక్షిత్ దుకాణానికి వెళ్లాడు.
కాగా, షాపు యజమాని లోపల ఉండటంతో కృష్ణేందు పలుమార్లు పిలిచాడు. ఎలాంటి స్పందన రాకపోవడంతో షాపు ముందు పడిన కుర్కురే ప్యాకెట్ తీసుకున్నాడు. డబ్బులు తర్వాత చెల్లిద్దామని భావించి ఇంటికి బయలుదేరాడు. ఇంతలో షాపు యజమాని శుభాంకర్ దీక్షిత్ బయటకు వచ్చాడు. బాలుడి వెంటపడి పట్టుకున్నాడు. షాపులో ఎవరూ లేకపోవడంతో డబ్బులు తర్వాత ఇద్దామన్న ఉద్దేశంతో కుర్కురే ప్యాకెట్ తీసుకున్నట్లు కృష్ణేందు చెప్పాడు. ఇప్పుడే డబ్బులు చెల్లిస్తానని కూడా అన్నాడు.
అయితే ఆ బాలుడు అబద్ధాలు చెబుతున్నాడని షాపు యజమాని శుభాంకర్ దీక్షిత్ ఆరోపించాడు. అందరి ముందు తిట్టడంతోపాటు అతడి చెంపపై కొట్టాడు. కృష్ణేందును దొంగగా ఆరోపించి గుంజీలు తీయించాడు. బాలుడి తల్లిని కూడా పిలిపించి అందరి ముందు ఆమెను కూడా తిట్టాడు.
మరోవైపు జరిగిన సంఘటనపై కృష్ణేందు మనస్తాపం చెందాడు. ఇంటికి చేరుకున్న తర్వాత డోర్ లాక్ చేసుకుని పురుగుల మందు సేవించాడు. ‘అమ్మా, నేను దొంగను కాదు. నేను దొంగతనం చేయలేదు. నేను వేచి ఉండగా మామ (దుకాణదారుడు) అక్కడ లేడు. తిరిగి వస్తుండగా పక్కన పడి ఉన్న కుర్కురే ప్యాకెట్ చూసి దానిని తీసుకున్నా. నాకు కుర్కురే అంటే చాలా ఇష్టం. నా చివరి మాటలు ఇవి. దయచేసి ఈ చర్యకు (పురుగుమందు తాగినందుకు) నన్ను క్షమించండి’ అని సూసైడ్ నోట్లో రాశాడు.
కాగా, కృష్ణేందు నోటి నుంచి నురగ రావడాన్ని కుటుంబ సభ్యులు గమనించారు. అచేతనంగా పడి ఉన్న అతడి పక్కనే పురుగుల మందు సీసా, సూసైడ్ నోట్ ఉండటాన్ని గమనించారు. వెంటనే ఆసుపత్రికి తరలించి ఐసీయూలో అడ్మిట్ చేశారు. అయితే చికిత్స పొందుతూ బాలుడు కృష్ణేందు మరణించాడు. ఈ విషయం తెలిసి శుభాంకర్ దీక్షిత్ తన షాపు మూసేశాడు. ట్రాఫిక్ పోలీస్‌లో పౌర వాలంటీర్‌గా ఉన్న అతడు పరారయ్యాడు. బాలుడి ఆత్మహత్యపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.