కోల్‌కతా, మే 23: చేయని నేరాన్ని తనపై మోపారని, చిప్స్ ప్యాకెట్‌ను అపహరించానని నింద వేసి తనను కొట్టారన్న అవమానాన్ని భరించలేక 12 ఏండ్ల బాలుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన పశ్చిమ బెంగాల్లో చోటుచేసుకుంది. ‘అమ్మా నేను దొంగను కాను’ అంటూ తల్లికి రాసిన సూసైడ్ నోట్ అందరి హృదయాన్ని కలచివేసింది. ఈ ఘటన పశ్చిమ్ మేదినీపూర్ జిల్లాలో గురువారం జరిగింది. ఏడో తరగతి చదువుతున్న కృష్ణండు చిప్స్ కొనుక్కోవడానికి ఒక షాపునకు వెళ్లాడు.
అయితే షాపులో యజమాని లేకపోవడంతో అక్కడ గుమ్మం వద్ద కింద పడి ఉన్న ఒక చిప్స్ ప్యాకెట్ తీసుకుని వెళ్తున్నాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన షాపు యజమాని అతడిని పట్టుకుని కొట్టడమే కాక, గుంజిళ్లు తీయించాడు. అక్కడికి వచ్చిన అతని తల్లిని కూడా దూషించాడు. తర్వాత ఇంటికి వచ్చిన ఆ బాలుడు గదిలోకి పోయి తలుపులేసుకుని పురుగుల మందు తాగాడు. అపస్మారక స్థితిలో ఉన్న అతడిని దవాఖానకు తరలించగా, చికిత్స పొందుతూ మరణించాడు. ‘అమ్మా నేను దొంగను కాను. నేను చిప్స్ దొంగిలించ లేదు. ఇదే నా ఆఖరి మాటలు’ అని కృష్ణండు తన సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు.