పాతానమిట్టై: రాబోయే జనరల్ ఎలక్షన్స్‌లో కేరళ ప్రజలు బీజేపీకి ఓటు వేస్తారని ప్రధాని మోదీ(PM Modi) అన్నారు. కేరళలో కమలం వికసిస్తుందని అన్నారు. బీజేపీ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. స్వామియే శరణం అయ్యప్ప అంటూ ఆయన తన స్పీచ్‌ను ప్రారంభించారు. ఇక్కడ యువతను బీజేపీ ఎంకరేజ్ చేస్తోందని, పాతానమిట్టై నుంచి బీజేపీ అభ్యర్థిగా అనిల్ కే ఆంథోనీ పోటీ చేస్తున్నారని, ప్రజలకు సేవ చేసేందుకు ఆయన ఉత్సాహంగా ఉన్నట్లు ప్రధాని తెలిపారు. కేరళ రాజకీయాల్లో ఇలాంటి యువరక్తం కావాలన్నారు. అందుకే కేరళ ప్రజలు కూడా ఈసారి బీజేపీకి 400 సీట్లు వస్తాయంటున్నారన్నారు. యూడీఎఫ్, ఎల్డీఎఫ్ ఒక్కటై ఓటర్లను చీట్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
కేరళ సంస్కృతిలో ఆధ్యాత్మిక ఉందని, యూడీఎఫ్, ఎల్డీఎఫ్ రాజకీయ హింసకు పాల్పడుతున్నాయని, ఇది కేరళలో శాంతికి విఘాతం కలిగిస్తోందని, రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించాయన్నారు.కాలేజీలు పలు ప్రాంతాల్లో కమ్యూనిస్టు గూండా అడ్డగా మారిందన్నారు. అవినీతి, అసమర్థ ప్రభుత్వం వల్ల కేరళ ప్రజలు వేదనకు గురవుతున్నట్లు చెప్పారు. ఎల్డీఎఫ్, యూడీఎప్ సైకిల్‌ను బ్రేక్ చేస్తేనే కేరళ ప్రజలకు లాభం జరుగుతుందన్నారు. అవినీతి ప్రభుత్వాన్ని కేరళ నుంచి తరిమివేయాలంటే తనకు మద్దతు ఇవ్వాలని అన్నారు.