Conrad Sangma – Manipur | మణిపూర్లో ఎన్ బీరెన్ సింగ్ సారధ్యంలోని బీజేపీ ప్రభుత్వం పట్ల విశ్వాసం కోల్పోయాం అని నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) అధ్యక్షుడు, మేఘాలయ సీఎం కన్రాడ్ సంగ్మా స్పష్టం చేశారు. మణిపూర్ లోని బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవాలని తమ పార్టీ నిర్ణయించిందని సోమవారం మీడియాకు చెప్పారు. బీరెన్ సింగ్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అశాంతి, హింస పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు.
‘మణిపూర్ ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూడలేకపోతున్నాం. పరిస్థితి ఏమాత్రం మెరుగు పడటం లేదు. బీరెన్ సింగ్ నాయకత్వంపై మేం విశ్వాసం కోల్పోయాం. బీరెన్ సింగ్ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం కష్టంగా మారింది. ఇక మేం ముందుకెళ్లలేం’ అని కన్రాడ్ సంగ్మా పేర్కొన్నారు.
మణిపూర్ లో ప్రభుత్వ సారధిని మార్చడంతోపాటు శాంతిని పునరుద్ధరించడానికి స్పష్టమైన ప్రణాళిక ఉంటే కలిసి పని చేసేందుకు ఎన్పీపీ సిద్ధంగా ఉందన్నారు. మణిపూర్ రాష్ట్రంలో బీజేపీ తర్వాత రెండో అతిపెద్ద పార్టీ ఎన్పీపీ కావడం గమనార్హం. ఎన్పీపీ, బీజేపీ పార్టీలు నేషనల్ డెమొక్రటిక్ అలయెన్స్ (ఎన్డీఏ) కూటమిలో భాగస్వాములు కావడం గమనార్హం.