చెన్నై: ఒక లారీ వేగంగా టర్నింగ్ తిరుగుతూ బస్సును ఢీకొట్టింది. దీంతో ఆ బస్సు పక్కకు ఒరిగిపోయింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది గాయపడ్డారు. తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో ఈ ఘటన జరిగింది. సోమవారం ఒక ప్రభుత్వ బస్సు ప్రయాణికులను ఎక్కించుకుని మెట్టుపాళయం నుండి సత్యమంగళంకు బయలుదేరింది. బస్సు ముందుకు కదలి మూడు జంక్షన్ల రోడ్డును సమీపించింది. తొలుత ఒక లోడ్ లారీ మలుపు తిరిగింది. దాని వెనుక వేగంగా మలుపు తిరిగిన మరో లోడ్ లారీ బస్సును వేగంగా ఢీకొట్టింది. దీంతో బస్సు పక్కకు ఒరిగిపోయింది. గమనించిన స్థానికులు బస్సులోని వారిని రక్షించేందుకు పరుగున వెళ్లారు.
కాగా, ఈ ప్రమాదంలో బస్సులోని ఏడుగురు ప్రయాణికులతోపాటు లారీ డ్రైవర్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. బస్సు డ్రైవర్, కండక్టర్తోపాటు ఇతర ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన వల్ల ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. మరోవైపు సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.