బెంగళూరు, సెప్టెంబర్ 18: సోషల్ మీడియా వచ్చాక చాలా మంది ప్రతి చిన్న విషయాన్ని బంధుమిత్రులతో పంచుకుంటున్నారు. దీంతో ఎప్పుడూ వారితో టచ్‌లో ఉన్నామనే భావన కలుగుతుంది. అయితే కొందరు కురచ బట్టలతో శరీరం కనిపించే ఫొటోలు, వీడియోలు పోస్టు చేస్తుంటారు. ముఖ్యంగా యూట్యూబ్ షాట్స్, ఇన్‌స్టా రీల్స్‌లో ఈ వీడియోలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇలాంటి వీడియోలు పెట్టేవారిలో ఆత్మవిశ్వాసం తక్కువగా ఉంటుందని, ఆత్మన్యూనతాభావానికి లోనై ఇలా చేస్తున్నారని ఓ తాజా అధ్యయనంలో తేలింది. బెంగళూరులోని ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సైస్’కు చెందిన ప్రొఫెసర్ డాక్టర్ మనోజ్ శర్మ జరిపిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
మరీ అందంగా కనిపించేందుకు..
చాలా అందంగా కనిపించేందుకు ఇలాంటి వారు తాపత్రయ పడుతుంటారని, ఈ వీడియోలు పెట్టడం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం కూడా ఇదేనని శర్మ వివరించారు. చదువులో వెనుకబాటుతనం, వేరే ఇతర కారణాల వల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొన్నారు. వారికి దీర్ఘకాలంలో మానసిక సమస్యలు పెరిగే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు. ఇలాంటి పరిస్థితులు ఆత్మహత్యకు దారి తీయొచ్చని, ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయని తెలిపారు. పైగా ఇలాంటి వీడియోలు చూసే వారిలో కూడా మానసిక సమస్యలు తలెత్తుతాయన్నారు. తీవ్రంగా అలవాటు పడటం, సామాజికంగా ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉందని వివరించారు.