పనాజి: గోవాలోని ఏకైక నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) ఎమ్మెల్యే చర్చిల్ అలెమావో ఆ రాష్ట్ర శాసన విభాగాన్ని సోమవారం రద్దు చేయడంతోపాటు తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో విలీనం చేశారు. బెనౌలిమ్ ఎమ్మెల్యే అయిన ఆయన ఈ మేరకు ఒక తీర్మానం చేశారు. గోవా స్పీకర్ రాజేష్ పట్నేకర్ను కలిసి దీనిని అందజేశారు. ఈ విలీనం నేపథ్యంలో అసెంబ్లీలో టీఎంసీ తరుఫున తనకు సీటు కేటాయించాలని అందులో కోరారు.
అనంతరం చర్చిల్ అలెమావో మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే పదవికి తాను ఎందుకు రాజీనామా చేయాలి? అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా కొనసాగుతానన్న ఆయన ఎన్సీపీ శాసనసభా విభాగాన్ని టీఎంసీలో విలీనం చేసినట్లు తెలిపారు. గోవాకు వచ్చిన టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ సమక్షంలో తాను ఆ పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు.