బెంగళూరు, అక్టోబర్ 11: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రధాన నిందితుడిగా ఉన్న ముడా భూ కుంభకోణం కేసులో లోకాయుక్త పోలీసులు గురువారం సిద్ధరామయ్య బావమరిది మల్లిఖార్జున స్వామి, మరో నిందితుడు దేవరాజ్‌లను విచారించింది. కాగా, ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సిద్ధరామయ్య రాజీనామా చేయాలంటూ విపక్షాలు చేస్తున్న డిమాండ్‌ను మంత్రివర్గం ఖండించింది. గురువారం సమావేశమైన మంత్రులు సీఎంకు పూర్తి మద్దతు ప్రకటించారు. తామంతా సిద్ధరామయ్య వెంటే ఉన్నామని మంత్రి హెచ్‌కే పాటిల్ తెలిపారు.
కొవిడ్-19 స్కామ్ నివేదికపై చర్యలకు సిట్
బీజేపీ అధికారంలో ఉండగా కొవిడ్-19 మందులు, పరికరాల కుంభకోణం నివేదికపై తదుపరి చర్యల కోసం కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)తో పాటు కేబినెట్ ఉస సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు రాష్ట్ర మంత్రివర్గం గురువారం పలు నిర్ణయాలు తీసుకుంది. బీజేపీ అధికారంలో ఉండగా కొవిడ్-19 సంక్షోభం సమయంలో మందులు, ఇతర పరికరాల కొనుగోలులో భారీ అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై జస్టిస్ మైఖేల్ డి కున్హా విచారణ సంఘం దర్యాప్తు జరిపి అందులో అక్రమాలు జరిగినట్టు నిర్ధారించింది.