Population census : దేశంలో జనాభా (Population) లెక్కల సేకరణ స్వరూపం ఈసారి పూర్తిగా మారపోనుంది. భారతదేశ చరిత్రలో మొదటిసారిగా పేపర్ వాడకుండా డిజిటల్ విధానం (Digital approach) లో జనాభా వివరాలను సేకరించబోతున్నారు. ఈ విషయాన్ని ఇవాళ లోక్‌సభ (Lok Sabha) లో కేంద్ర హోంశాఖ (Union Home Ministry) సహాయ మంత్రి వెల్లడించారు.
డిజిటల్ విధానంలో జనాభా లెక్కల సేకరణ కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రెండు మొబైల్ యాప్‌లను, ఒక వెబ్ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. రెండు యాప్‌లలో ఒకటి జనాభా లెక్కలు సేకరించే వారి కోసం కాగా.. మరొకటి పౌరుల కోసం తయారు చేశారు. గతంలో జనాభా వివరాలు సేకరించాలంటే ఒక వ్యక్తి నుంచి 30 చొప్పున ప్రశ్నలు అడిగాల్సి వచ్చేంది. కానీ ఇప్పుడు ప్రశ్నలతో యాప్‌లను రూపొందించారు. జనగణకులు తమ యాప్‌లో పౌరుల వివరాలను ఎంట్రీ చేస్తారు.
ఆసక్తి ఉన్న పౌరులు వారి కోసం సిద్ధం చేసిన యాప్ ద్వారా నేరుగా తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు. పౌరులు నమోదు చేసుకున్న వివరాలను జనగణకులు ఇంటికి వచ్చి పరిశీలిస్తారు. ఈ విధానం ద్వారా జనగణన కోసం ఎక్కువ సమయం వెచ్చించాల్సిన అవసరం తప్పుతుంది. మన దేశంలో సాధారణంగా ప్రతి 10 సంవత్సరాలకు ఓసారి జనాభా లెక్కలను సేకరిస్తారు. చివరిసారిగా 2011లో జనగణన జరిగింది. కరోనా కారణంగా 2021లో జనగణన వాయిదా పడింది. ఈ క్రమంలో 2027లో జనగణనకు కేంద్రం సిద్ధమైంది.