న్యూఢిల్లీ, ఆగస్టు 12: ఇంట్లో పెద్ద యెత్తున నోట్ల కట్టలు బయటపడిన ఉదంతంలో జస్టిస్ యశ్వంత్ వర్మపై పార్లమెంట్లో అభిశంసన ప్రక్రియ మొదలైన క్రమంలో అతనిపై వచ్చిన ఆరోపణలపై విచారణకు ముగ్గురు సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా మంగళవారం ప్రకటించారు. ఈ ప్యానల్లో సుప్రీం కోర్టుకు చెందిన జస్టిస్ అరవింద్ కుమార్తో పాటు, మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ మహీందర్ మోహన్, సీనియర్ అడ్వకేట్ బీవీ ఆచార్య ఉంటారు.
జస్టిస్ వర్మను అభిశంసించాలంటూ 146 మంది ఎంపీలు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఆమోదించినట్టు ప్రకటించిన స్పీకర్ దీనిపై నియమించిన కమిటీ సాధ్యమైనంత త్వరలో తన నివేదికను సమర్పిస్తుందని చెప్పారు. ఆ కమిటీ తుది నివేదిక సమర్పించే వరకు అభిశంసన ప్రతిపాదన పెండింగ్లోనే ఉంటుందని ఆయన ప్రకటించారు.
ఒకవేళ ఈ నివేదికలో జస్టిస్ వర్మ దోషిగా తేలితే మొదట నివేదిక ప్రవేశపెట్టిన సభ దానిని ఆమోదిస్తుంది. ఓటింగ్ కోసం ఒక తీర్మానాన్ని ప్రవేశపెడతారు. ఇదే ప్రక్రియను రెండో సభలో కూడా పాటిస్తారు. ఆ రోజు సభకు హాజరైన సభ్యులలో మూడింట రెండొంతుల మంది అనుకూలంగా ఓటు వేయాల్సి ఉంటుంది.