న్యూఢిల్లీ, ఆగస్టు 7: పారిస్ ఒలింపిక్స్‌లో పతకం ఖాయమైన దిశలో అనూహ్య రీతితో అనర్హతకు గురైన రెజ్లర్ వినేశ్ ఫోగాట్‌కు పార్టీలకు అతీతంగా మద్దతు లభిస్తున్నది. వినేశ్‌కు మద్దతుగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ట్వీట్ చేశారు. వినేశ్ అనర్హత వేటుకు గురైనప్పటికీ 140 కోట్ల మంది గుండెల్లో మాత్రం విజేతగా నిలుస్తారని, పారిస్ ఒలింపిక్స్‌లో ఆమె అసాధారణ ఆటతీరు ప్రతి భారతీయుని ఆకట్టుకుందని, దేశం గర్వించేలా చేసిందని ముర్ము పేర్కొన్నారు. వినేశ్ విజేతల్లోకెల్లా విజేత అని, దేశానికి ఆమె గర్వకారణమని, ప్రతి భారతీయుడికి స్ఫూర్తి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కేంద్ర మంత్రులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు సైతం వినేశ్ ఫోగాట్‌కు మద్దతు తెలుపుతూ ట్వీట్లు చేశారు.
వినేశ్ ఫోగాట్ అనర్హతలో కుట్రకోణం ఉండొచ్చని, ఆమెకు న్యాయం చేయాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. రాజ్యసభలో ఈ అంశంపై చర్చకు కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే పట్టుబట్టగా, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ అనుమతించలేదు. అనంతరం పార్లమెంటు ఉభయసభల నుంచి ఇండియా కూటమి సభ్యులు వాకౌట్ చేశారు. పార్లమెంటు ప్రాంగణంలో నిరసన చేపట్టారు. వినేశ్ ఫోగాట్‌పై కుట్రలు ఆపండి, వినేశ్‌కు న్యాయం జరగాలి అంటూ నినాదాలు చేశారు. వినేశ్ విషయమై లోక్‌సభలో కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ స్పందిస్తూ… యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్(యూడబ్ల్యూడబ్ల్యూ) వద్ద ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ గట్టిగా నిరసన తెలిపిందని చెప్పారు. ఈ విషయమై సరైన చర్యలు చేపట్టాలని ఐఓఏ చీఫ్ పీటీ ఉషకు ప్రధాని మోదీ సూచించినట్టు చెప్పారు.