Lok Sabha polls : పశ్చిమబెంగాల్లో లోక్‌సభ ఎన్నికల తుది విడత పోలింగ్ సందర్భంగా తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్నాయి. జయనగర్ లోక్‌సభ నియోజకవర్గంలో అధికార తృణమూల్ కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఇరువర్గాలు గుంపులుగా చేరి ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘటనలో ANI స్ట్రింగర్‌కు తీవ్ర గాయాలయ్యాయి.
బీజేపీ, టీఎంసీ కార్యకర్తలు ఒకరినొకరు రాళ్లతో కొట్టుకుంటున్న సమయంలో ఆ దృశ్యాలను ఏఎన్ఐ స్ట్రింగర్ బంటీ ముఖర్జి తన కెమెరాలో బంధించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఒక రాయి వచ్చి ముఖర్జి తలకు బలంగా తగలడంతో తీవ్ర గాయమైంది. దాంతో ఎన్నికల అధికారులు అతడిని హుటాహుటిన కోల్‌కతాలోని మెడికా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించారు.
అదేవిధంగా బెంగాల్ వివిధ ప్రాంతాల్లో ఇవాళ ఘర్షణలు చోటుచేసుకున్నాయి. నార్త్ 24 పరగణాల జిల్లాలో పోలింగ్ ప్రారంభానికి ముందే స్థానికులు గుంపులుగా పోలింగ్ కేంద్రంలోకి వచ్చి ఈవీఎంలను ఎత్తుకెళ్లారు. రెండు వీవీ ప్యాట్ మిషన్లను పోలింగ్ కేంద్రం పక్కన ఉన్న చెరువులో పడేశారు. ఈ విడతలో వెస్ట్‌బెంగాల్‌లో మొత్తం 9 లోక్‌సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతున్నది.