Lok Sabha Elections : ఐదో దశ లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఎనిమిది రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 లోక్‌సభ స్థానాలకు ఇవాళ పోలింగ్ జరుగుతోంది. అన్ని నియోజకవర్గాల్లో ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల దగ్గర బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కానీ ఉత్తరప్రదేశ్‌లోని రెండు గ్రామాల్లో, జార్ఖండ్‌లోని ఓ గ్రామంలో మాత్రం ప్రజలు ఎన్నికలను బహిష్కరించారు.
తమ గ్రామాల నుంచి ఇతర ప్రాంతాలకు రాకపోకలు సాగించేందుకు వంతెనలు లేవని, దాంతో తాము చాలా ఇబ్బందులు పడుతున్నామని ఆయా గ్రామాల ప్రజలు చెబుతున్నారు. ఎన్నికల వచ్చినప్పుడల్లా వంతెనలు నిర్మిస్తామని హామీ ఇస్తున్న నేతలు.. ఆ తర్వాత ఆ హామీలను తుంగలో తొక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే వంతెనలు నిర్మించిన తర్వాతనే తాము ఓటు వేస్తామని వారు స్పష్టం చేస్తున్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లా హిసామ్‌పూర్ మర్హో గ్రామానికి చెందిన ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లాంటే తప్పకుండా రైల్వే ట్రాక్‌ను దాటాల్సిందే. ఇలా రైల్వే ట్రాక్‌ను దాటే ప్రయత్నంలో ఇప్పటికే 12 మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో రైల్వే ట్రాక్‌పై బ్రిడ్జి నిర్మించాలని ఆ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా యూపీలో బారాబంకి జిల్లాకు చెందిన పరహాజీ గ్రామ వాసులది కూడా ఇదే బాధ. వారి గ్రామానికి ఆనుకుని ఉన్న నదిపై వంతెన లేకపోవడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
జార్ఖండ్ రాష్ట్రం హజారీబాగ్ లోక్‌సభ నియోజకవర్గంలోని కుసుంభా గ్రామానిది కూడా అదే దుస్థితి. హజారిబాగ్‌లోని ఎన్టీపీసీ ప్లాంట్ కారణంగా కుసుంభా గ్రామస్తులు ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే అడ్డంకిగా మారింది. దాంతో వారి రాకపోకల కోసం అండర్ పాస్ నిర్మించి ఇస్తామని ఎన్టీపీసీ చెబుతోంది. కానీ అండర్ పాస్‌తో తాగునీళ్ల సరఫరాకు, నిత్యావసరాల సరఫరాకు, వైద్య సేవలకు తాము ఎదుర్కొవాల్సి వస్తుందని, కాబట్టి అండర్‌పాస్‌కు బదులుగా బ్రిడ్జి నిర్మించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈ కారణాలతోనే మూడు గ్రామాల ప్రజలు ఇవాళ ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.