న్యూఢిల్లీ : లోక్సభ(Lok Sabha) ఇవాళ నిరవధిక వాయిదా పడింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఇవాళ 21వ రోజు. అయితే ఎక్కువ శాతం ఈ సెషన్లో నిరసనలతోనే సభ గడిచింది. బీహార్లో చేపట్టిన ఓట్ల సవరణ ప్రక్రియపై చర్చ చేపట్టాలని విపక్షాలు ముందు నుంచి డిమాండ్ చేస్తున్నాయి. కానీ ఆ అంశంపై ఇచ్చిన వాయిదా తీర్మానాలను ప్రభుత్వం మాత్రం పక్కన పెట్టేసింది. జాబితా నుంచి 65 లక్షల ఓటర్ల తొలగింపుపై చర్చ చేపట్టాలని వర్షాకాల సమావేశాలు ప్రారంభం నుంచీ విపక్షాలు డిమాండ్ చేశాయి.
ఇవాళ లోక్సభకు ప్రధాని మోదీ వచ్చారు. కానీ విపక్షాలు మాత్రం తమ పట్టువీడలేదు. విపక్షాల తీరుతో విసుగెత్తిన స్పీకర్ ఓం బిర్లా .. సభను నిరవధికంగా వాయిదా వేశారు. విపక్షాల వల్లే ఈసారి సభ సరిగా జరగలేదని ఆయన అన్నారు. ఇక రాజ్యసభ ఇవాళ మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా పడింది.