LK Advani | బీజేపీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ ఆరోగ్యం నిలకడగా ఉందని ఢిల్లీలోని ఇంద్రప్రస్త అపోలో దవాఖాన మంగళవారం ఓ బులెటిన్ విడుదల చేసింది. నెమ్మదిగా కోలుకుంటున్నారని, ఒకటి, రెండు రోజుల్లో ఆయన్ను ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ) నుంచి షిఫ్ట్ చేస్తామని దవాఖాన యాజమాన్యం దృవీకరించింది. ఈ నెల 12 నుంచి ఐసీయూలోనే అద్వానీ చికిత్స పొందుతున్నారు.
‘భారత ఉప ప్రధాని ఎల్ కే అద్వానీ.. ఇంద్రప్రస్తలోని అపోలో దవాఖానలో ఈ నెల 12 నుంచి డాక్టర్ వినీత్ సూరి పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. క్రమంగా ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగు పడుతున్నది. ఆరోగ్య పరిస్థితిని బట్టి ఒకటి, రెండు రోజుల్లో ఐసీయూ నుంచి బయటకు తరలిస్తాం’ అని దవాఖాన తెలిపింది.
గత ఆగస్టులో కూడా అపోలో దవాఖానలో అద్వానీ చికిత్స పొందారు. ఈ ఏడాది ప్రారంభంలో ఎయిమ్స్ లో చికిత్స పొందారు. గత మార్చిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనకు భారత్ రత్న పురస్కారం అందజేశారు. 1927 నవంబర్ ఎనిమిదో తేదీన కరాచీ (ప్రస్తుతం పాకిస్థాన్)లో అద్వానీ జన్మించారు. 1942లో ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్ గా చేరారు. 1986-1990, 1993-98, 2004-05 మధ్య బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా అద్వానీ పని చేశారు.