న్యూఢిల్లీ: ఢిల్లీలోని గాంధీ విహార్ ఏరియాలో యూపీఎస్సీ ప్రిపేరవుతున్న 32 ఏళ్ల అభ్యర్థి అనుమానాస్పద రీతిలో మృతిచెందిన విషయం తెలిసిందే. రాంకేశ్ మీనా అనే వ్యక్తి తన ఫ్లాట్‌లో మంటల్లో కాలి ప్రాణాలు విడిచాడు. అయితే ఈ కేసులో ఢిల్లీ పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. అతనితో సహజీనవం(Live-In Partner) చేస్తున్న అమ్మాయితో పాటు మర్డర్‌లో భాగమైన మరో ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. ఫోరెన్సిక్ సైన్సులో బీఎస్సీ చదువుతున్న 21 ఏళ్ల అమ్మాయిని, ఆమె మాజీ బాయ్‌ఫ్రెండ్‌ను, అతని స్నేహితుడిని అరెస్టు చేశారు. వీళ్లంతా యూపీలోని మొరాదాబాద్ నివాసితులు.
బాధిత వ్యక్తితో యూపీ మహిళ గత కొన్నాళ్ల నుంచి లివిన్ రిలేషన్లో ఉన్నది. అయితే మరో ఇద్దరితో కలిసి యూపీఎస్సీ ప్రిపేరవుతున్న మీనా అనే వ్యక్తిని హత్య చేయించింది. ఆ హత్యను అగ్నిప్రమాదంగా చిత్రీకరించేలా ప్రయత్నించినట్లు పోలీసులు వెల్లడించారు. గాంధీ విహార్ బిల్డింగ్‌లోని నాలుగవ అంతస్తులో రాంకేశ్ మీనా నివాసం ఉంటున్నాడు. అక్టోబర్ 6వ తేదీన ప్రమాదం జరిగినట్లు పోలీసులకు సమాచారం వెల్లింది. ఏసీ బ్లాస్ట్ కావడం వల్ల అగ్ని ప్రమాదం జరిగినట్లు పేర్కొన్నారు. అయితే మంటల్ని ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది అక్కడకు వెళ్లారు. ఆ సమయంలో ఇంట్లో ఓ కాలిన మృతదేహాన్ని గుర్తించారు. ఈ ఘటనలో కేసు నమోదు చేసిన పోలీసులు ఆ తర్వాత దర్యాప్తు చేపట్టారు.
అయితే అక్టోబర్ 5వ తేదీ రాత్రి సీసీటీవీ ఫూటేజ్‌ను పోలీసులు సేకరించారు. ముఖానికి బట్ట కట్టుకున్న ఇద్దరు వ్యక్తులు ఆ బిల్డింగ్‌లోకి ప్రవేశించారు. ఆ తర్వాత ఓ అమ్మాయి ఓ వ్యక్తితో బయటకు వెళ్తున్నట్లు గుర్తించారు. వాళ్లు వెళ్లిన కాసేపటికి ఆ ఇంట్లో మంటలు వ్యాపించాయి. ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఆ అమ్మాయి కాల్ రికార్డులను పరిశీలించారు. క్రైంసీన్‌లో మహిళ ఉన్నట్లు భావించిన పోలీసులు ఆమె కోసం మొరాదాబాద్‌లో తనిఖీలు నిర్వహించారు. అక్టోబర్ 18వ తేదీన ఆమెను అదుపులోకి తీసుకున్నారు. నేరం చేసినట్లు ఆ మహిళ అంగీకరించింది. తనకు సహకరించిన ఇద్దరు వ్యక్తుల పేర్లను కూడా వెల్లడించింది.
పోలీసుల విచారణలో ఆ అమ్మాయి కొన్ని విషయాలను వెల్లడించింది. తనకు చెందిన కొన్ని అసభ్యకర వీడియోలను మీనా షూట్ చేశాడని, వాటిని డిలీట్ చేసేందుకు నిరాకరించాడని ఆ అమ్మాయి చెప్పింది. ఈ విషయాన్ని తన మాజీ ప్రియుడికి చెప్పిందామె. దీంతో ఆగ్రహానికి గురైన మాజీ ప్రియుడు మీనాను చంపేయాలని డిసైడ్ అయ్యాడు.
బాధితుడు మీనాను తొలుత గొంతు నులిమి చంపేశారు. ఆ తర్వాత అతనిపై నూనె, నెయ్యి, మద్యం పోశారు. అమ్మాయి మాజీ ప్రియుడు గతంలో ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్‌గా పనిచేశాడు. ఆ అనుభవంతో గ్యాస్ సిలిండర్ వాల్వ్ ఓపెన్ చేసిన అతను.. దానికి నిప్పు అంటుకునేలా చేశాడు. దీంతో ఆ సిలిండర్ పేలింది. బాధితుడికి చెందిన హార్డ్ డిస్క్, ల్యాప్టాప్స్, ఇతర వస్తువులతో నిందితులు పరారీ అయ్యారు. నిందితుల నుంచి హార్డ్ డిస్క్, ట్రాలీ బ్యాగ్, రెండు మొబైల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు. ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగనున్నది.