చెన్నై, నవంబర్ 19: భారత జీవన బీమా సంస్థ (ఎల్ఐసీ) మంగళవారం వివాదానికి కేంద్ర బిందువైంది. దాని అధికారిక వెబ్‌సైట్‌ను ఇంగ్లిష్‌లో కాకుండా పూర్తిగా హిందీలోకి మార్చడంపై తమిళనాడులోని రాజకీయ పార్టీలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయి. బలవంతంగా హిందీని రుద్దుతున్నారంటూ మండిపడ్డాయి. ఎల్ఐసీ ఇటీవలే తన అధికారిక వెబ్‌సైట్‌ను ఆధునీకరించింది. దాని హోం పేజ్ మొత్తాన్ని హిందీలోకి మార్చేశారు.
భాషను ఇంగ్లిష్‌లోకి మార్చుకొనే ఆప్షన్ సైతం హిందీలోనే కనిపించింది. దీనిపై తమిళపార్టీలు భగ్గుమన్నాయి. హిందీని తమపై బలవంతంగా రుద్దడానికి ఎల్ఐసీని ఒక ప్రచారాస్త్రంగా మార్చుకున్నారని సీఎం స్టాలిన్ మండిపడ్డారు. సంస్కృతిని, భాషను బలవంతంగా ప్రయోగించాలనుకోవడం దేశ వైవిధ్యాన్ని తుంగలో తొక్కడమేనని వ్యాఖ్యానించారు. దీనిపై ఎల్ఐసీ వివరణ ఇస్తూ, కేవలం సాంకేతిక కారణాల వల్ల హోం పేజ్ హిందీలోకి మారిందని తెలిపింది.