బుధవారం 01 ఏప్రిల్ 2020
National - Feb 19, 2020 , 03:40:20

కసబ్‌ హిందూ ఉగ్రవాది

కసబ్‌ హిందూ ఉగ్రవాది
  • 26/11 ముంబై దాడులను
  • ‘హిందూ ఉగ్రవాద’ చర్యగా ఏమార్చే కుట్ర!
  • లష్కరే తాయిబా నాడు వ్యూహాలను పన్నింది
  • కసబ్‌కు సమీర్‌ ఛౌదరి అనే పేరు.. చేతికి ఎర్రరంగు కంకణం
  • కసబ్‌ను హత్యచేసేందుకూ ప్లాన్‌.. దావూద్‌ గ్యాంగ్‌కు బాధ్యతలు
  • ‘లెట్‌మీ సే ఇట్‌ నౌ’ పుస్తకంలో ముంబై మాజీ సీపీ రాకేశ్‌ మారియా వెల్లడి

ముంబై:  26/11.. ఈ తేదీ వినగానే మనకు దేశ చరిత్రలోనే అత్యంత భయానకమైన ఉగ్రదాడి కళ్లముందు కదలాడుతుంది. దాదాపు పన్నేండేండ్ల కిందట దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పాకిస్థాన్‌కు చెందిన 10 మంది ఉగ్రవాదులు సాగించిన నరమేధంలో 166 మంది ప్రాణాలు కోల్పోగా, 300 మందికిపైగా గాయపడ్డారు. అయితే ఈ దాడిని ‘హిందూ ఉగ్రవాద’ చర్యగా చిత్రీకరించేందుకు ‘లష్కరే తాయిబా’ ఉగ్రవాద సంస్థ కుట్రలు పన్నినట్లు తేలింది. ముంబై మాజీ పోలీస్‌ కమిషనర్‌ రాకేశ్‌ మారియా.. ‘లెట్‌ మీ సే ఇట్‌ నౌ’ పేరిట రచించిన పుస్తకంలో ఈ వివరాలు వెల్లడించారు. ఈ పుస్తకం సోమవారం విడుదలైంది. ముంబై ఉగ్రదాడులపై తాను సాగించిన దర్యాప్తునకు సంబంధించి పలు ఆసక్తికర అంశాలను అందులో ప్రస్తావించారు. ఉగ్రవాదుల పేర్లను మార్చి, భారతీయ చిరునామాలపై నకిలీ గుర్తింపు కార్డులు సృష్టించారని.. దాడుల్లో కీలకంగా వ్యవహరించిన ఉగ్రవాది మొహమ్మద్‌ అజ్మల్‌ అమీర్‌ కసబ్‌ను బెంగళూరుకు చెందిన సమీర్‌ ఛౌదరిగా పేర్కొన్నారని మారియా తన పుస్తకంలో వివరించారు. ‘అంతా ప్రణాళిక ప్రకారం జరిగితే అతడు సమీర్‌ చౌదరిగానే మరణిస్తాడు. దీంతో మీడియా దాన్ని హిందూ ఉగ్రవాద చర్యగా భావిస్తుంది’ అని లష్కరే తాయిబా కుట్ర పన్నినట్లు తెలిపారు. అంతేగాకుండా కసబ్‌ చేతికి హిందువులు ధరించే ఎర్ర రంగు కంకణం కట్టారు.


 దీంతో ఈ ఘటనను హిందూ టెర్రర్‌గా నమ్మించే ప్రయత్నం చేశారు. ‘హిందూ ఉగ్రవాదులు ముంబైపై దాడి చేశారని మీడియా సంస్థలు హోరెత్తిస్తాయని, ‘కసబ్‌ తల్లిదండ్రుల’ ఇంటర్వ్యూలు తీసుకునేందుకు టాప్‌ టీవీ జర్నలిస్టులు బెంగళూరుకు పరుగులు తీస్తారని భావించారు. అయితే వారి కుట్రలు ఫలించలేదు. కసబ్‌ పాకిస్థాన్‌లోని ఫరీద్‌కోట్‌కు చెందినవాడిగా తేలింది’ అని వివరించారు. కసబ్‌ సజీవంగా పట్టుబడడంతో పోలీసులకు తమకు సంబంధించిన ఆధారాలు లభిస్తాయన్న కారణంతో పాకిస్థాన్‌ ఐఎస్‌ఐ, లష్కరే తాయిబా అతడిని చంపే ప్రయత్నాలు కూడా చేసినట్లు మారియా వెల్లడించారు. ఈ పనిని దావూద్‌ ఇబ్రహీం గ్యాంగ్‌కు అప్పగించినట్లు తెలిపారు. ‘వాస్తవానికి కసబ్‌ దొంగతనాలు చేసేందుకు లష్కరే తాయిబాలో చేరారు. జీహాద్‌తో అతడికి సంబంధం లేదు. అయితే భారత్‌లో ముస్లింలను నమాజ్‌ చేసుకునేందుకు కూడా అనుమతించరని అతడిని నమ్మించారు. మెట్రో సినిమా థియేటర్‌ సమీపంలోని మసీదులో కసబ్‌ను ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతించినప్పుడు అతడు షాక్‌కు గురయ్యాడు’ అని మరియా తన పుస్తకంలో పేర్కొన్నారు. ముంబై దాడులకు వెళ్లే ముందు లష్కరే తాయిబా సూత్రధారులు కసబ్‌కు రూ.1.25 లక్షలు అందజేసి, వారం రోజులు సెలవులు ఇచ్చారని చెప్పారు. ఆ నగదును అతడు తన సోదరి పెండ్లి కోసం కుటుంబ సభ్యులకు అందజేశాడని తెలిపారు. 2012 నవంబర్‌ 21న కసబ్‌ను ఉరితీసిన సంగతి తెలిసిందే.


షీనా బోరా కేసులోనూ సంచలనాలు

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన షీనాబోరా హత్య కేసుకు సంబంధించి కూడా మారియా తన పుస్తకంలో పలు కీలక అంశాలు వెల్లడించారు. తన అనంతరం ముంబై పోలీస్‌ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన అహ్మద్‌ జావేద్‌.. షీనా బోరా హత్య కేసు నిందితులు ఇంద్రాణి, పీటర్‌ ముఖర్జియాలకు ముందే తెలుసునని చెప్పారు. అలాగే పీటర్‌కు నాటి జాయింట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ దేవేన్‌ భారతికి కూడా మంచి పరిచయం ఉన్నదని పేర్కొన్నారు. ప్రస్తుతం మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్కాడ్‌ అధిపతిగా పనిచేస్తున్న దేవేన్‌ ఈ ఆరోపణలను ఖండించారు. వాస్తవాలను వెల్లడించడానికి బదులు పుస్తకాన్ని అమ్ముకునేందుకు చేస్తున్న మార్కెటింగ్‌ ప్రయత్నాలు ఇవని విమర్శించారు. ఈ కేసులో పీటర్‌ ముఖర్జియాను 2015 నవంబర్‌ 19న అరెస్ట్‌చేశారు. ఈ కేసులో ఆయన మాజీ భార్య ఇంద్రాణి ప్రధాన నిందితురాలు. ఇంద్రాణి మొదటి భర్త కూతురే షీనాబోరా. మరో కేసులో ఇంద్రాణి డ్రైవర్‌ శ్యామ్‌వర్‌ రాయ్‌ని పోలీసులు అరెస్ట్‌ చేయడంతో ఈ హత్య వెలుగులోకి వచ్చింది.logo
>>>>>>