మైసూరు, డిసెంబర్ 31: మైసూరులోని ఇన్ఫోసిస్ కంపెనీ ప్రాంగణంలో చిరుత కనిపించడం కలకలం రేపింది. దాన్ని పట్టుకోవడానికి అటవీశాఖ అధికారులు వేట ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేయాలని ఇన్ఫోసిస్ కోరింది. మంగళవారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో అండర్ గ్రౌండ్ పార్కింగ్ ప్రాంతంలో చిరుతను కంపెనీ భద్రతా సిబ్బంది గుర్తించారు.
ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లోనూ కనిపించడంతో చిరుత సంచారాన్ని అధికారులు ధ్రువీకరించారు. దీంతో 50 మంది సుశిక్షితులైన అటవీ శాఖ బృందం బోను, వలలతో ఇన్ఫోసిస్ క్యాంపస్‌కు చేరుకొని చిరుతను పట్టుకొనేందుకు కూంబింగ్ ప్రారంభించింది.
‘350 ఎకరాల్లో విస్తరించిన ఇన్ఫోసిస్ క్యాంపస్‌లో కొన్ని ప్రాంతాలు చూడ్డానికి అడవిలాగా ఉంటాయి. చిరుత సమీపంలోని నివాస ప్రాంతాల్లోకి వెళ్లకుండా అవసరమైన చర్యలు తీసుకున్నాం. దాని జాడ గుర్తించడానికి థర్మల్ కెమెరా కలిగిన డ్రోన్‌ను కూంబింగ్‌లో ఉపయోగిస్తున్నాం’ అని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే తెలిపారు.