Leopard attack : మహారాష్ట్ర (Maharastra) లోని పుణె నగర (Pune city) శివార్లలో ఘోరం జరిగింది. ఇంటి వెనుకాల పొలంలో పనిచేస్తున్న తాతకు తాగునీళ్లు ఇచ్చేందుకు వెళ్లిన చిన్నారిని చిరుతపులి (Leopard) ఎత్తుకెళ్లి చంపేసింది. స్థానికులు ఈ ఘటనపై పోలీసులకు, అటవీ అధికారులకు సమాచారమిచ్చారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వివరాల్లోకి వెళ్తే.. పుణె శివార్లలోని పింపార్ఖేడ్ గ్రామంలో తమ ఇంటి సమీపంలోని పొలంలో పనిచేస్తున్న తాతకు మంచినీళ్లు ఇవ్వడానికి శివన్య శైలేష్ బొంబే అనే ఐదేళ్ల బాలిక వెళ్లింది. ఆ సమయంలో అక్కడే నక్కిఉన్న చిరుతపులి ఒక్కసారిగా చిన్నారిపై దాడిచేసి పొదల్లోకి ఈడ్చుకపోయింది. అక్కడే పొలాల్లో పనిచేస్తున్న కొందరు దీన్ని గమనించి.. కర్రలతో తరిమారు.
దాంతో అక్కడికి కొద్ది దూరంలో చిన్నారిని వదిలి చిరుత పారిపోయింది. మెడపై తీవ్రమైన బాలికను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయినా చికిత్స పొందుతూ ఆ బాలిక మరణించింది. పోలీసులు, అటవీశాఖ అధికారులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు. చిరుతపులిని గుర్తించేందుకు కెమెరా ట్రాప్లను, థర్మల్ డ్రోన్లను ఉపయోగించారు.