బెంగళూరు : స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా సరదాగా గడపాలనుకున్న కుటుంబానికి చేదు అనుభవం ఎదురైంది. బెంగళూరులోని బన్నేరుఘట్ట జంతు ప్రదర్శన శాలలో చిరుతల సఫారీని చూసేందుకు వెళ్లినపుడు ఈ ఘటన జరిగింది. వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని డ్రైవర్ ఓ చోట ఆపాడు. అక్కడ రోడ్డు పక్కన ఓ చిరుత కనిపించింది. వాహనాన్ని ముందుకు పోనివ్వగా, అది అకస్మాత్తుగా లేచి, ఆ వాహనం వెంటబడింది. కిటికీ పక్కనే ఉన్న పదమూడేళ్ల బాలునిపై ఆ చిరుత దాడి చేసింది. ఆ బాలుడు గాయపడ్డాడు. ఆ వాహనంలోని ఇతర ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అయితే, స్థానికుల కథనం ప్రకారం, ఆ బాలుడు చేతులను కిటికీ బయటకు పెట్టడంతో చిరుత దాడి చేసినట్లు తెలుస్తున్నది. ఈ సంఘటనను వెనుక వాహనంలో ప్రయాణిస్తున్నవారు వీడియో తీసి, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.