న్యూఢిల్లీ : మళ్లీ బ్యాలెట్ పేపర్ల విధానానికి మరలే అంశం జమిలి ఎన్నికలకు సంబంధించిన రెండు బిల్లులను పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) పరిధిలోకి రాదని కేంద్ర న్యాయ శాఖ స్పష్టం చేసినట్టు తెలిసింది. జేపీసీలోని కొందరు సభ్యులు మళ్లీ బ్యాలెట్ పేపర్ల విధానాన్ని ప్రవేశపెట్టాలని చేసిన సూచనకు న్యాయ శాఖ లిఖితపూర్వకంగా స్పందించాల్సి ఉంది.
కమిటీ సభ్యులు చేసిన భిన్న సూచనలకు న్యాయ శాఖకు చెందిన లెజిస్లేటివ్ విభాగం సవివరంగా జవాబులు ఇచ్చినప్పటికీ బ్యాలెట్ పేపర్ విధానంపై చేసిన సూచనకు మాత్రం సూటిగా సమాధానం ఇవ్వలేదని తెలిసింది. బ్యాలెట్ పేపర్ విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టాలని సూచించే పరిధి జేపీసీకి లేదని న్యాయశాఖ పేర్కొన్నట్టు తెలిసింది. ఈవీఎంల వినియోగం లేదా బ్యాలెట్ పేపర్ వాడకం అనే అంశాలను జేపీసీ పరిశీలించడం లేదని న్యాయ శాఖ తెలిపినట్టు వర్గాలు పేర్కొన్నాయి.