న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13: దేశంలో సౌర విద్యుత్తు వినియోగం పెంచడానికి మరో అడుగు పడింది. కరెంట్ బిల్లుల భారం తగ్గింపు, ఆదాయం పెరుగుదల, పలువురికి ఉపాధి లక్ష్యంతో ప్రతి నెలా కోటి ఇండ్లకు నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత కరెంట్‌ను అందించేందుకు ప్రవేశపెట్టిన ‘పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన’ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ప్రారంభించారు.
సౌర విద్యుత్తు ఉత్పత్తి, సుస్థిర ప్రగతి సాధనకు దీనిని ప్రవేశపెట్టినట్టు చెప్పారు. ఈ ప్రాజెక్టు కింద 75 వేల కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టనున్నట్టు ఆయన ‘ఎక్స్’లో తెలిపారు. ఈ పథకం పొందడానికి వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. రూఫ్ టాప్ సోలార్ వ్యవస్థ ఏర్పాటుకు బ్యాంకుల నుంచి భారీగా రుణాలు పొందవచ్చునని చెప్పారు. ఈ పథక వాటాదారులను జాతీయ పోర్టల్‌కు అనుసంధానం చేస్తారన్నారు. ఈ పథకం కింద ఇచ్చే సబ్సిడీలను ప్రజల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా జమవుతాయన్నారు.