Laugh | హైదరాబాద్, జూలై 11 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): ‘నవ్వు నాలుగు విధాల చేటు’ అని మన పెద్దవాళ్లు అంటే, నవ్వడం నలభై విధాల మేలు అని జపాన్ ప్రభుత్వం అంటున్నది. అనడమే కాదు.. ప్రతీ పౌరుడు రోజులో కనీసం ఒక్కసారైనా బిగ్గరగా నవ్వడం తప్పనిసరిని చేస్తూ ఉత్తర జపాన్లోని యమగటా స్థానిక యంత్రాంగం కొత్త నిబంధనను కూడా తీసుకొచ్చింది. బిగ్గరగా నవ్వితే, గుండె సమస్యలు తగ్గుముఖం పడుతాయని వారు చెప్తున్నారు. ఈ మేరకు యమగటా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకుల ‘లాఫర్ స్టడీ’ని ఉదహరిస్తున్నారు.
40 ఏండ్ల కంటే తక్కువ వయసున్న 17,152 మందిపై యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు విస్తృతస్థాయి పరిశోధనలు చేశారు. వారంలో ఎన్నిసార్లు బిగ్గరగా నవ్వుతారంటూ? ఓ ప్రశ్నావళిని సిద్ధంచేశారు. సమాధానాలను రాబట్టిన తర్వాత కొన్నేండ్లు వారి ఆరోగ్యాన్ని విశ్లేషించారు. వారంలో ఒక్కసారి కూడా బిగ్గరగా నవ్వని వారికి గుండె సమస్యలు ఎక్కువగా వచ్చినట్టు గుర్తించారు.
ఒకటి కంటే ఎక్కువసార్లు బిగ్గరగా నవ్వినవారికి గుండె సమస్యలు తక్కువగా వచ్చినట్టు, రోజూ బిగ్గరగా నవ్వేవారికి గుండె సమస్యలు పెద్దగా ఎదురుకాలేదని తెలిపారు. బిగ్గరగా నవ్వితే, శరీరంలోని నాడీలు, కండరాలు ఉత్తేజితమవుతాయని, రక్త ప్రసరణ చురుగ్గా సాగుతుందని, మానసిక-శారీరక ప్రశాంతత కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. గుండె సమస్యలు ఉన్నవారికి ‘లాఫింగ్ థెరపీ’ ఇస్తున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు.