హైదరాబాద్: బీహార్ మాజీ ఎంపీ ఆనంద్ మోహన్‌సింగ్ లాంటి గ్యాంగ్స్టర్లు తిరిగి సమాజంలోకి రాకూడదని దివంగత ఐఏఎస్ కృష్ణయ్య కూతురు పద్మ అన్నారు. తన తండ్రి హత్య కేసులో నిందితుడైన ఆనంద్ మోహన్ సింగ్‌ను 29 ఏండ్ల తర్వాత గురువారం విడుదల చేయడంపై ఆమె తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రధాని మోదీ జోక్యం చేసుకొని తగిన న్యాయం చేయాలని ఆమె కోరారు.
‘ఈ విషయంలో పోరాడటానికి నాకు శక్తి లేదు. ఇలాంటి గ్యాంగ్స్టర్లు బీహార్‌తో పాటు ఏ రాష్ట్రంలోనూ స్వేచ్ఛగా తిరగకుండా ఒక చట్టం తీసుకురావాలి. ప్రస్తుత పరిస్థితిని పరిగణనలోనికి తీసుకోండి’ అంటూ ఆమె కన్నీటి పర్యంతమయ్యారు.
గురువారం ఆమె ఒక టీవీ చానల్‌తో మాట్లాడారు. ‘మీకు నా తండ్రి గురించి తెలియకపోతే బీహార్ ప్రజలను అడగండి. ఈనాటికీ వారు నా తండ్రి కోసం పోరాడటానికి సిద్ధంగా ఉన్నారు’ అని ఆమె అన్నారు. ఆనంద్ మోహన్ సింగ్ విడుదలపై అటు బీఎస్పీతో సహా పలు రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు, కేంద్ర ఐఏఎస్ అధికారుల సంఘం నితీశ్ సర్కారుపై ధ్వజమెత్తాయి. ‘సివిల్ సర్వెంట్లుగా ఉండటం విలువైనదేనా? అని కొన్నిసార్లు కొందరు ఆశ్చర్యపోతారు. ఈ విషయంలో సుప్రీం కోర్టు, సీజేఐ జోక్యం చేసుకోవాలి’ అని తెలంగాణ సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి స్మితా సబర్వాల్ బుధవారం ట్వీట్ చేశారు.