కోల్‌కతా: ప్యాంటు జేబుల్లో స్మార్ట్ఫోన్లను, ఒడిలో ల్యాప్‌టాప్‌ను సుదీర్ఘ సమయం పెట్టుకునే పురుషులకు సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గిపోయే ముప్పు పెరగవచ్చు. చివరికి నపుంసకత్వానికి దారి తీయవచ్చు. కలకత్తా విశ్వవిద్యాలయంలోని జువాలజీ డిపార్ట్మెంట్కు చెందిన జెనెటిక్స్ రిసెర్చ్ యూనిట్, కోల్‌కతాలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీప్రొడక్టివ్ మెడిసిన్ సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.
శరీరం దిగువ భాగంపై ఎలక్ట్రానిక్ డివైస్ల ప్రభావం పడినపుడు సంతానోత్పత్తి సామర్థ్యం దెబ్బతినే ముప్పు ఎక్కువగా ఉందని ఈ అధ్యయనంలో వెల్లడైంది. ల్యాప్‌టాప్‌లను ఒడిలో పెట్టుకోవడం లేదా మొబైల్ ఫోన్లను ప్యాంట్ల జేబుల్లో పెట్టుకోవడం వల్ల అత్యంత తీవ్రతగల విద్యుదయస్కాంత క్షేత్రం ఏర్పడుతుందని తెలిసింది. ఇటువంటి విద్యుదయస్కాంత క్షేత్రానికి, వేడికి వృషణాలు సుదీర్ఘ సమయం గురయినపుడు, వృషణాల్లో ఉండే సున్నితమైన టిష్యూకు చెప్పుకోదగ్గ స్థాయిలో నష్టం జరుగుతుందని, ఫలితంగా వీర్యాన్ని ఉత్పత్తి చేసే కణాలు మరణిస్తాయని పరిశోధకులు గుర్తించారు.