బిలాస్పూర్: హిమాచల్ ప్రదేశ్లో మంగళవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఒక ప్రైవేట్ బస్సుపై భారీగా కొండచరియలు విరిగిపడటంతో 18 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం బిలాస్పూర్ జిల్లాలో మరోటన్-కలోల్ రూట్లో 30 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఒక ప్రైవేట్ బస్సుపై బల్లు బ్రిడ్జి సమీపంలో పక్కనే ఉన్న కొండ ప్రాంతం నుంచి భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో 18 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ముగ్గురిని రక్షించారు. మృతుల సంఖ్య ఇంకా ఎక్కువ కావచ్చునని బిలాస్పూర్ డిప్యూటీ కమిషనర్ రాహుల్ కుమార్ తెలిపారు. జేసీబీని తెప్పించి శిథిలాలను తొలగిస్తున్నట్టు ఆయన చెప్పారు. స్థానికులు సహాయంతో అధికారులు క్షతగాత్రులను వెలికి తీస్తున్నారన్నారు. ప్రమాదంపై ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.రెండు లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున సహాయం ప్రకటించారు. బస్సు ప్రమాదంపై హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.