Amit Shah : నక్సలిజం (Naxalism) పై పోరులో ఇది గుర్తుంచుకోదగిన రోజు అని కేంద్ర హోంమంత్రి (Union Home Minister) అమిత్ షా (Amith Shah) అన్నారు. మావోయిస్టు పార్టీ (Maoist party) కి దశాబ్దాలపాటు అత్యంత కీలకనేతగా వ్యవహరించిన మల్లోజుల వేణుగోపాల్‌రావు (Mallojula Venugopal Rao) బుధవారం మహారాష్ట్ర సీఎం (Maharastra CM) దేవేంద్ర ఫడ్నవీస్ ముందు లొంగిపోయిన మరుసటి రోజే మరో 170 మంది మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్ (Chattishgarh) లో సరెండర్ అయ్యారు. ఈ విషయాన్ని చెబుతూ అమిత్ షా పై వ్యాఖ్యలు చేశారు.
ఈ మేరకు ఆయన ‘ఎక్స్’లో సుదీర్ఘ పోస్టు పెట్టారు. బుధవారం ఛత్తీస్‌గఢ్‌లో 27మంది, మహారాష్ట్రలో 61 మంది జనజీవన స్రవంతిలోకి వచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. గత రెండు రోజుల వ్యవధిలో 258 మంది మావోయిస్టులు లొంగిపోయారని తెలిపారు. భారత రాజ్యాంగంపై తమ విశ్వాసాన్ని ప్రకటిస్తూ హింసను త్యజించాలనే వీరి నిర్ణయాన్ని అభినందిస్తున్నట్లు అమిత్ షా పేర్కొన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం వామపక్ష తీవ్రవాదాన్ని అంతం చేసేందుకు చేస్తున్న ప్రయత్నాల ఫలితాలను ఇది ప్రతిబింబిస్తుందన్నారు. తమ విధానం స్పష్టంగా ఉందన్న అమిత్ షా.. లొంగిపోయేవారిని స్వాగతిస్తామని, ఇంకా తుపాకీ కొనసాగించాలనుకొనే వారు మాత్రం భద్రతా దళాల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. నక్సలిజం మార్గంలో ఇంకా కొనసాగుతున్న వారు తమ ఆయుధాలను విడిచిపెట్టి ప్రధాన స్రవంతిలో చేరాలని మరోసారి విజ్ఞప్తి చేశారు.
2026 మార్చి 31 నాటికి నక్సలిజాన్ని సమూలంగా నిర్మూలించేందుకు తాము కట్టుబడి ఉన్నామని అమిత్ షా పునరుద్ఘాటించారు. ఒకప్పుడు వామపక్ష తీవ్రవాద స్థావరాలుగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌లోని అబూజ్మడ్, ఉత్తర బస్తర్లు విముక్తి పొందిన ప్రాంతాలుగా ప్రకటించడం సంతోషదాయకమని తెలిపారు. ఇప్పుడు దక్షిణ బస్తర్‌లో నక్సలిజం ఉందని, దాన్ని భద్రతాదళాలు త్వరలో తుడిచిపెడతాయని పేర్కొన్నారు. కాగా ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ సర్కార్ ఏర్పాడిన తర్వాత జనవరి 2024 నుంచి 2,100 మంది మావోయిస్టులు లొంగిపోగా.. 1785మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. మరో 477 మంది ఎన్కౌంటర్లలో మరణించారని చెప్పారు.