పాట్నా: తన తండ్రి, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఢిల్లీలో బందీగా ఉన్నారని ఆయన కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ ఆరోపించారు. నెల కిందట ఆయనకు బెయిల్ వచ్చినప్పటికీ ఇంకా నిర్బంధంలోనే ఉన్నారని అన్నారు. బీహార్‌లో శనివారం జరిగిన ఒక కార్యక్రమంలో తేజ్ ప్రతాప్ యాదవ్ మాట్లాడారు. ‘మా నాన్నకి ఆరోగ్యం బాగోలేదు. పార్టీలో నాలుగైదు మంది ఆర్జేడీ జాతీయ అధ్యక్షుడు కావాలని కలలు కంటున్నారు. వారి పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు. వారు అందరికీ తెలిసిన వారే. ఆయన జైలు నుండి దాదాపు ఒక సంవత్సరం క్రితం విడుదలయ్యారు. కానీ ఇంకా బందీగానే ఉన్నారు’ అని వ్యాఖ్యానించారు.
తాను తన తండ్రితో మాట్లాడానని, పాట్నాలో తనతో కలిసి ఉండి పార్టీ వ్యవహారాలను చూసుకోవాలని కోరినట్లు తేజ్ ప్రతాప్ యాదవ్ అన్నారు. తన తండ్రి పాట్నాలో ఉన్నప్పుడు తమ నివాసం ప్రధాన గేట్ ఎప్పుడూ తెరిచి ఉండేదని, ఇంటి బయట ఉండే సాధారణ ప్రజలను ఆయన కలిసేవారని తేజ్ ప్రతాప్ గుర్తు చేశారు.
పార్టీలోని కొందరు ఆర్జేడీ చీఫ్ కావాలని కలగంటున్నారంటూ పరోక్షంగా తన సోదరుడు తేజశ్వి యాదవ్‌పై తేజ్ ప్రతాప్ మండిపడ్డారు. తేజ్ ప్రతాప్‌కు సన్నిహితుడైన ఆకాశ్ యాదవ్‌ను పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించారు. ఈ నేపథ్యంలో సోదరుడు తేజశ్వి యాదవ్‌పై తేజ్ ప్రతాప్ యాదవ్ గుర్రుగా ఉన్నారు.
మరోవైపు లాలూ ఢిల్లీలో బందీగా ఉన్నరంటూ తేజ్ ప్రతాజ్ యాదవ్ చేసిన ఆరోపణలను ఆయన సోదరుడు తేజశ్వి యాదవ్ ఖండించారు. ‘లాలూ జీ చాలాకాలం బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ఎల్కే అద్వానీని కూడా అరెస్టు చేయించారు. లాలూ నిర్బంధంలో ఉన్నారన్నది ఆయన హోదాకు సరిపోలదు’ అని వ్యాఖ్యానించారు.