దేశంలోని కుటుంబ రాజకీయాలపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలకు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. ప్రధాని మోదీకి, బిహార్ సీఎం నితీశ్‌కి పిల్లలు కలగాలని నేను దేవుణ్ని ప్రార్థిస్తానని, వారు కూడా రాజకీయాల్లోకి రావాలని ప్రార్థిస్తానని లాలూ కౌంటర్ ఇచ్చారు. సీఎం నితీశ్‌కు, ప్రధాని మోదీకి పిల్లలు లేకపోతే నేనేం చేయాలి? అయితే సీఎం నితీశ్‌కి ఓ కుమారుడు ఉన్నాడు. కానీ ఆయన రాజకీయాలకు సరిపడడు. నేనేం చేయగలను? అందుకే వారి పిల్లలు కలగాలని నేను దేవుణ్ని ప్రార్థిస్తాను. వారు రాజకీయాల్లోకి రావాలని కూడా ప్రార్థిస్తాను అని లాలూ ప్రసాద్ పేర్కొన్నారు.
ప్రధాని మోదీ ఏమన్నారంటే..
ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల క్రితం ఓ జాతీయ ఛానల్లో మాట్లాడారు. ఈ సందర్భంగా దేశంలో నడుస్తున్న కుటుంబ రాజకీయాలపై విరుచుకుపడ్డారు. ఈ ట్రెండ్ ప్రజాస్వామ్యానికి పెద్ద గొడ్డలిపెట్టు అంటూ మోదీ విరుచుకుపడ్డారు. ‘నేను సమాజం కోసమే ఉన్నాను. లోహియా కుటుంబం రాజకీయాల్లో ఉందా? ఆయన ఓ సోషలిస్టు. ఫెర్నాండేజ్ కుటుంబం రాజకీయాల్లో వుందా? ఈయనా ఓ సమాజ్‌వాదీయే. నితీశ్ కుమార్.. మాతో కలిసే పనిచేస్తున్నారు. ఆయన కూడా ఓ సోషలిస్టు. వారి కుటుంబం రాజకీయాల్లో ఉందా? ప్రజాస్వామ్యానికి వారసత్వ రాజకీయాలు పెద్ద శత్రువు’ అంటూ మోదీ విమర్శించారు.