పాట్నా : బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ వివాదంలో చిక్కుకున్నారు. ఆయన పాదాల వద్ద డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఫొటో ఉన్నట్లు కనిపిస్తున్న వీడియోను బీజేపీ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. ఆయన 78వ జన్మదినోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ సంఘటన జరిగినట్లు తెలిపింది. రాష్ట్ర షెడ్యూల్డు కులాల కమిషన్ ఆదివారం ఆయనకు నోటీసు ఇచ్చింది. 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని, లేనిపక్షంలో చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ను, దళితుల మనోభావాలను లాలూ కించపరుస్తున్నారని బీజేపీ ఆరోపించింది. ఆర్జేడీది రాజ్యాంగేతర భావజాలమని మండిపడింది. బీహార్ మాజీ సీఎం, కేంద్ర మంత్రి జీతన్ రామ్ మాంఝీ స్పందిస్తూ, ఒకరి పాదాల చెంత అంబేద్కర్ ఫొటోను పెట్టడమంటే ఆయనను మాత్రమే కాకుండా యావత్తు దళిత జాతిని అవమానించినట్లేనని మండిపడ్డారు. జన సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దీనిపై స్పందించాలని డిమాండ్ చేశారు.