Prashant Kishor : బీహార్ (Bihar) లో అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) పోలింగ్ తేదీలు దగ్గర పడుతుండటంతో అధికార, ప్రతిపక్ష కూటమి నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. బుధవారం జన్ సురాజ్ పార్టీ అధ్యక్షుడు (Jan Suraj Party chief) ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor) మాధేపురాలో తన పార్టీ అభ్యర్థి తరఫున ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా అధికార, ప్రతిపక్ష కూటమి నేతలపై ప్రశాంత్ కిషోర్ విరుచుకుపడ్డారు. ప్రస్తుతం బీహార్‌లో ఉన్న అన్ని సమస్యలకు ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, జేడీయూ చీఫ్ నితీశ్ కుమారే మూలమని ఆయన మండిపడ్డారు. ఆ ఇద్దరు కేంద్ర మంత్రులుగా, సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రులుగా పనిచేసిన బీహార్ అభివృద్ధిని పట్టించుకోలేదని విమర్శించారు.
ఈసారి బీహార్ ఓటర్లు విద్య, ఉద్యోగాలు, మార్పు కోసం ఓట్లు వేయాలని ప్రశాంత్ కిషోర్ కోరారు. ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వివిధ రాష్ట్రాల నుంచి ఓటర్లు బీహార్‌కు చేరుకున్నారని, ప్రభుత్వం మారకపోతే వాళ్లంతా 10, 15 రోజుల్లో మళ్లీ ఉపాధి కోసం వలస వెళ్లాల్సిందేనని పీకే వ్యాఖ్యానించారు. చెన్నై, గుజరాత్, ఢిల్లీ, ముంబైకి వెళ్లి ఎప్పలాగా బతుకాల్సిందేనని అన్నారు.
ఈ ఎన్నికల్లో జన్ సురాజ్ పార్టీని గెలిపిస్తే ఉపాధి కోసం వివిధ రాష్ట్రాల్లో జీవనం గడుపుతున్న బీహారీలు మళ్లీ అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఉండదని ప్రశాంత్ కిషోర్ చెప్పారు. ఓటర్లు మళ్లీ లాలూ, నితీశ్‌కు ఓటు వేస్తే జంతువుల్లా రైళ్లలో మళ్లీ వలసపోవాల్సిందేనని వ్యాఖ్యానించారు. సొంత రాష్ట్రంలో ఉపాధి పొందాలని అనుకుంటున్నారో లేదంటే పొరుగు రాష్ట్రాలకు వలసపోవాలనుకుంటున్నారో బీహారీలే తేల్చుకోవాలని అన్నారు.