అలప్పుజ: తమకు సుపరిచితుడైన అనిల్ కిశోర్ అనే యాచకుడి వద్ద రూ.4.5 లక్షల నగదు ఉందని తెలుసుకొని అలప్పుజ ప్రజలు షాక్ తిన్నారు! సోమవారం రాత్రి అతడు రోడ్డు ప్రమాదానికి గురవడంతో స్థానికులే అతడిని దవాఖానలో చేర్పించారు. అక్కడ అతడు చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం చనిపోయాడు. పోలీసులు అతడు నివాసం ఉండే కంటైనర్ను పరిశీలించినప్పుడు ప్లాస్టిక్ డబ్బాల్లో రూ.4.5 లక్షల నగదు నిల్వ చేసి ఉండటం కనిపించింది. ఆ డబ్బాల్లో రద్దయిన రూ.2 వేల నోట్లు, సౌదీ కరెన్సీ కూడా ఉన్నాయి. అనిల్ ఆ నగదు గురించి ఎవరికీ ఎలాంటి వివరాలు తెలుపలేదు.
కంటెయినర్లో లభించిన డబ్బును కోర్టుకు అందజేస్తామని పోలీసులు తెలిపారు. చట్టపరంగా ఆ డబ్బును ఏం చేయాలనేది కోర్టు నిర్ణయిస్తుందని చెప్పారు. ఇప్పటి వరకు అనిల్ కుటుంబ సభ్యులం తామేనని ఎవరూ ముందుకు రాలేదు. చరుమ్మూట్ ప్రాంతంలో అనిల్ ప్రతి ఒక్కరికీ తెలిసిన ముఖమని.. అతడి దగ్గర ఇంత పెద్ద మొత్తంలో డబ్బు దొరకడంతో ప్రతి ఒక్కరూ షాక్కు గురయ్యాయరని పంచాయతీ సభ్యుడు ఫిలిప్ ఉమ్మన్ చెప్పారు.