Laapataa Ladies | కేసుల విచారణకు వేదికగా ఉన్న దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) ఇప్పుడు ఓ అరుదైన సందర్భానికి వేదికగా మారబోతోంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఓ చిత్రాన్ని (Movie Screening) దేశ అత్యున్నత న్యాయస్థానంలో ప్రదర్శించనున్నారు.
సుప్రీం కోర్టు ఆవిర్భవించి 75 ఏళ్లు అవుతోంది. ఈ సందర్భంగా పలు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, వారి కుటుంబ సభ్యులు, రిజిస్ట్రీ అధికారుల కోసం బాలీవుడ్ చిత్రం ‘లాపతా లేడీస్’ (Laapataa Ladies)ను ప్రదర్శించనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇవాళ సాయంత్రం 4:15 నుంచి 6:20 వరకూ అడ్మినిస్ట్రేషన్ భవనంలోని సి-బ్లాక్‌లో గల ఆడిటోరియంలో ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నట్లు వెల్లడించారు.
ఈ చిత్రాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ (Chief Justice) డి.వై. చంద్రచూడ్ (D Y Chandrachud) సహా న్యాయమూర్తులు, వారి కుటుంబ సభ్యులు, ఇతర రిజిస్ట్రీ అధికారులు కలిసి వీక్షించనున్నారు. ఇక ఈ స్క్రీనింగ్‌కు ప్రముఖ నటులు ఆమిర్ ఖాన్, దర్శకురాలు కిరణ్‌రావు కూడా రానున్నట్లు సర్క్యులర్‌లో పేర్కొన్నారు.
బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ (Aamir Khan) ప్రోడక్షన్లో వచ్చిన చిత్రమే ‘లాపతా లేడీస్’ (Laapataa Ladies). అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావ్ (Kiran Rao) ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. జమ్తారా (Jamtara) వెబ్‌సిరీస్ ఫేమ్ స్పర్శ్ శ్రీవాస్తవ్ (Sparsh Shrivastav) ఈ మూవీలో హీరోగా నటించగా.. భోజ్‌పురి నటుడు రవి కిషన్ కీలక పాత్రలో మెరిశాడు. ఈ సినిమా మార్చి 1న ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. కొత్తగా పెళ్లి అయిన ఓ జంట పెళ్లి అనంతరం ఇంటికి వస్తుండగా మధ్యలో తన భార్య మిస్ అవుతుంది. అయితే ఈ విషయం తెలియక వరుడు తన భార్య అనుకుని వేరే అతడి భార్యను ఇంటికి తీసుకువస్తాడు. తీరా ఇంటికి వచ్చి చూసిన అనంతరం తన భార్య కాదని షాక్ అవుతాడు. దీంతో తన భార్య పోయిందని పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ ఇస్తాడు. అయితే తన భార్య ఎలా మిస్ అయ్యింది. తన భార్య స్థానంలో వచ్చిన అమ్మాయి ఎవరు. ఆ తర్వాత ఏర్పడిన పరిస్థితులు ఏంటి అనే స్టోరీతో ఈ సినిమా వచ్చింది.
2001లో గ్రామీణ ప్రాంతానికి చెందిన ఇద్దరు యువ వధువులు రైలు ప్రయాణంలో తప్పిపోయిన సంఘటన ఆధారంగా ఈ సినిమా రాగా దాదాపు పన్నెండేళ్ల విరామం తర్వాత ఈ సినిమాతో కిరణ్ రావ్ మెగాఫోన్ పట్టింది. ఆమె చివరగా 2010లో దోబీ ఘాట్ అనే చిత్రానికి దర్శకత్వం వహించింది. ఈ చిత్రం అప్పట్లో ఇంటర్వెల్ లేకుండా తీసిన మూవీగా రికార్డు సాధించింది.
Also Read..
Manish Sisodia | సిసోడియాకు బెయిల్.. 17 నెలల తర్వాత భారీ ఊరట
CM Revanth Reddy | తెలంగాణను ఇకపై ఫ్యూచర్ స్టేట్ అని పిలుద్దాం: సీఎం రేవంత్ రెడ్డి