న్యూఢిల్లీ : హైవేలపై ఇక నుంచి కొత్త నిబంధన అమల్లోకి రానుంది. ఎలక్ట్రానిక్ టోల్ వసూళ్లలో జరుగుతున్న దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం ఇప్పుడు ‘కేవైసీ’ (మీ వినియోగదారుని తెలుసుకోండి) తరహాలోనే ‘కేవైవీ’ (మీ వాహనాన్ని తెలుసుకోండి)ని తప్పనిసరి చేసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం అన్ని ఫాస్టాగ్‌లు తప్పనిసరిగా కేవైసీ నిబంధనలు పాటించాలి.
ప్రతి ఫాస్టాగ్‌ను వాహనం యూనిక్ రిజిస్ట్రేషన్ నంబర్ (వీఆర్ఎన్), ఛాసిస్ నంబర్‌తో లింక్ చేయాలి. ఫాస్టాగ్‌ను జారీ చేసే సంస్థలు ‘ఒక వాహనానికి ఒక ట్యాగ్’ నిబంధనను కచ్చితంగా పాటించాలి. ఐదు సంవత్సరాల కన్నా పాత ట్యాగ్‌లను కూడా మార్చాలి. ఈ నెల 31 (శుక్రవారం) నుంచి ఈ కేవైవీ ప్రక్రియను తప్పనిసరి చేశారు. ఎన్హెచ్ఏఐ చొరవతో మోసాలను అరికట్టేందుకు దీనిని తీసుకొచ్చింది.