న్యూఢిల్లీ: దేశంలో బీజేపీ హవా క్రమంగా తగ్గిపోతున్నది. గత పదేండ్లలో నాలుగైదు మినహా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కాషాయ జెండా ఎగురవేశాయి. అయితే ప్రభుత్వ వ్యతిరేకత పెరిగిపోతుండటం, మోదీ మేనియా పడిపోవడంతో ప్రతిపక్షాలు పుంజుకుంటున్నాయి. బీజేపీ గద్దెదించడమే అజెండాగా ఒక్కో రాష్ట్రంలో పాగావేస్తూ వస్తున్నాయి. తాజాగా ఎన్నికల ముగిసిన హర్యానా (Haryana), జమ్ముకశ్మీర్‌లోనూ కమలం పార్టీ ప్రతిపక్షానికి పరిమితమవనుందని ఎగ్జిట్‌పోల్స్ స్పష్టం చేశాయి. హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్‌కు బ్రేక్ వేసిన ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజార్టీని ఇవ్వనున్నాయని పేర్కొన్నాయి. దీంతో రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ఎవరనేదానిపై చర్చ నడుస్తున్నది. ఈ నేపథ్యంలో పార్టీ సీనియర్ నాయకురాలు కుమారి సెల్జా (Kumari Selja) పేరు ప్రముఖంగా వినిపిస్తున్నది. సీఎం పీఠంపై సెల్జా కూర్చునే అవకాశాలు ఎక్కువగా ఉందన్న చర్చనడుస్తున్నది. దానికోసం ఆమె కూడా జోరుగా ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి, పార్టీ సీనియర్ నేత భూపిందర్ హుడా ఏమన్నారంటే.. మనది ప్రజాస్వామ్యం. ముఖ్యమంత్రి ఎవరైనా కావచ్చు. అయితే ఆ విషయాన్ని నిర్ణయించేది ఎమ్మెల్యేలు, పార్టీ అధిష్ఠానమని వెల్లడించారు. పార్టీ చెప్పినట్లు అంతా నడుచుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. తాము ఎన్ని స్థానాలు గెలుస్తామన్న దానిపై స్పష్టత రావాల్సి ఉందన్నారు. అయితే మెజార్టీ సీట్లలో విజయం సాధిస్తామన్న నమ్మ ఉందని చెప్పారు. కాగా, ముఖ్యమంత్రి పదవి కోసం కుమారి సెల్జా, రణ్‌దీప్ సుర్జేవాలా గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఇద్దరిలో అధిష్ఠానం ఎవరివైపు మొగ్గుచూపుతుందో చూడాలి మరి.
హర్యానాలో 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. శనివారం ఒక విడతలో అన్ని సీట్లకు పోలింగ్ జరిగింది. హర్యానాను హస్తం పార్టీ చేజిక్కించుకుంటుందని, 44 నుంచి 61 స్థానాలు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అంచనావేశాయి. ఈ నెల 8న ఓట్లను లెక్కించనున్నారు.