హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): రూ.100 కోట్ల కస్టమ్స్ డ్యూటీ ఎగవేత కేసులో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు అరెస్టు చేసిన లగ్జరీ కార్ల డీలర్ బషారత్ ఖాన్ పఠాన్ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. బషారత్ ఖాన్ నిర్వహించే ఎస్కే కార్ లాంజ్ నుంచే కాంగ్రెస్ మంత్రి కారును కొనుగోలు చేసినట్లు వెల్లడైంది. గతేడాది మే 31న హైదరాబాద్‌లోని రోడ్ నంబర్ 10, బంజారాహిల్స్‌లోని ఓ కీలక మంత్రికి చెందిన అడ్రస్ పేరుతో ‘లెక్సస్ ఎల్ఎక్స్ జే30ఎల్ ఆర్‌హెచ్‌డీ ఎల్ఎక్స్ 500డీ’ కారును ఆయనకు ఇష్టమైన నంబర్ ‘టీజీ 09 2112’తో కొనుగోలు చేశారు.
ట్యాక్స్‌లు, సెస్సులు అన్నీ కలుపుకొని ఆ లగ్జరీ కార్ మొత్తం విలువ రూ.1,69,76,080గా చూపించారు. ఈ విషయాన్ని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ తన ఎక్స్ ఖాతా వేదికగా తెలియజేశారు. కాగా, ఇదే కేసు విషయంలో మలయాళ నటులు పృథ్వీరాజ్ సుకుమారన్, దులర్ సల్మాన్ నివాసాల్లో మంగళవారం కస్టమ్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. అయితే, వారి వద్ద నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి విలాసవంతమైన వాహనాలను గుర్తించ లేదని తెలిసింది.
ఇంటెలిజెన్స్ వర్గాలు ఇచ్చిన నివేదికల ప్రకారం.. భూటాన్ ఆర్మీ తన వాహనశ్రేణిలోని కొన్ని ఖరీదైన వాహనాలను ఉపసంహరించుకుంది. వాటిని కొందరు ఏజెంట్లు వేలంలో అతి తకువ ధరకు దకించుకున్నారు. వాటికి ఎలాంటి కస్టమ్స్ డ్యూటీ చెల్లించకుండా ఇండియాకు స్మగ్లింగ్ చేశారన్న సమాచారం బయటకు వచ్చింది. అత్యంత ఖరీదైన ఈ వాహనాలను హిమాచల్ ప్రదేశ్ మీదుగా భారత్‌లోని కొన్ని తాతాలిక చిరునామాలకు తరలించారట. సినీ, వ్యాపార వర్గాలు సహా కొందరు విశ్వసనీయ కొనుగోలుదారులను గుర్తించి వారికి మాత్రమే వీటిని విక్రయిస్తున్నారని డీఆర్ఐ గుర్తించింది.
లగ్జరీ కార్ల వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్‌ను మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ ఎక్స్‌లో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్కే కార్ లాంజ్ నుంచి అతి ఖరీదైన ‘లెక్సస్ 500 డీ’ కారు కొనుగోలు చేసిన కాంగ్రెస్ మంత్రి పొంగులేటి గురించి ఏ ఒక్కరూ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ అనిల్‌కుమార్ అదే ఎస్కే కార్ లాంజ్ నుంచి ఖరీదైన ల్యాండ్ క్రూజర్ కారును కొనుగోలు చేశారని చెప్పారు. ఈ రెండు అంశాలపై కాంగ్రెస్, బీజేపీలు ఎందుకు మౌనంగా ఉన్నాయని నిలదీశారు.