హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ) : జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు చనిపోవడంపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్‌లో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పర్యాటకుల ప్రాణాలు తీయడం హేయమైన చర్య అని ఆయన అన్నారు. ఈ పాశవిక దాడిలో మృతి చెందిన కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వారికి మెరుగైన వైద్య సహాయం అందించాలన్నారు. ఈ అమానుష దాడిలో ఆప్తులను కోల్పోయిన వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండగా నిలువాలన్నారు. కశ్మీర్లో ఉగ్రవాద మూకలకు స్థానం లేదన్న సందేశాన్ని బలంగా ఇవ్వాలని కేటీఆర్ కేంద్రాన్ని కోరారు.