Krishna Mohan : అయోధ్య విరాళాల (Ayodhya donations) చోరీ ఘటన నేపథ్యంలో శ్రీ రామజన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టు (Ram Janmabhumi Theerthakshetra Trust) ప్రధాన కార్యదర్శిగా కృష్ణ మోహన్ (Krishna Mohan) నియమితులయ్యారు. చంపత్ రాయ్ (Champath Roy) రాజీనామాను ఆమోదించిన ట్రస్టు.. ఆయన స్థానంలో తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా కృష్ణమోహన్ (Krishna Mohan) కు బాధ్యతలు అప్పగించింది. ఈ విషయాన్ని ట్రస్టు కోశాధికారి గోవింద్ గిరి (Govind Giri) మీడియాకు వెల్లడించారు.
అయోధ్య విరాళాల చోరీ వ్యవహారం వెలుగులోకి రావడంతో నైతిక బాధ్యత వహిస్తూ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్, సభ్యుడు అనిల్ మిశ్రా ఇటీవల రాజీనామా చేశారు. సోమవారం మధ్యాహ్నం నుంచి దాదాపు మూడు గంటలకుపైగా కొనసాగిన ఈ సమావేశానికి ట్రస్ట్ ఛైర్మన్ నృత్యగోపాల్ దాస్తోపాటు తొమ్మిది మంది శాశ్వత సభ్యుల్లో ఏడుగురు హాజరు కాగా.. చంపత్ రాయ్, మిశ్రా మాత్రం హాజరు కాలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఈ సమావేశం అనంతరం గోవింద్ గిరి మాట్లాడుతూ.. ఆలయంలో చోరీకి గురయ్యాయని చెబుతున్న విలువైన వస్తువులన్నింటినీ ప్రదర్శిస్తామన్నారు. చంపత్ రాయ్‌ను సమర్థిస్తూ తన దృష్టిలో ఆయన నిష్కళంకుడు అన్నారు. ఆలయ ఉద్యమం కోసం ఆయన చేసిన త్యాగాన్ని ప్రశంసించారు. విరాళాల చోరీకి పాల్పడిన దోషులకు కఠిన శిక్ష పడాలని తాము కోరుకుంటున్నామని తెలిపారు. సనాతనంపై ఆకస్మికంగా ప్రేమను ప్రదర్శిస్తున్న వారు హిందువులను విభజించాలని చూస్తున్నారని ఆరోపించారు.
అలాగే ఈ కేసులో దోషులుగా తేలిన వారికి తగిన శిక్షలు ఉంటాయని తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా నియమితులైన కృష్ణమోహన్ తెలిపారు. ఈ ఘటనతో తమ ప్రతిష్ఠ దెబ్బతిందన్న ఆయన.. ట్రస్టీలందరూ భక్తుల విశ్వాసాన్ని పునరుద్ధరించేందుకు, ట్రస్టు లక్ష్యాలకు అనుగుణంగా విరాళాలను సమర్థంగా నిర్వహించేలా కృషిచేస్తారని అన్నారు.