న్యూఢిల్లీ: కొంకణ్ రైల్వే లైన్లో శుక్రవారం భారీ ముప్పు తప్పింది. ట్రాక్‌మ్యాన్ మహాదేవ అప్రమత్తత, ధైర్యసాహసాలు ఘోర ప్రమాదాన్ని తప్పించాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, కుమ్ట-హొన్నవర్ స్టేషన్ల మధ్య మహాదేవ రొటీన్ డ్యూటీలో ఉండగా శుక్రవారం తెల్లవారుజాము 4.50 గంటలకు ఓ ట్రాక్ జాయింట్ వెల్డింగ్ అసంపూర్తిగా ఉన్నట్లు గుర్తించారు. ఆ సమయంలో తిరువనంతపురం-ఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్ ఈ మార్గంలో వస్తున్నది. దీంతో అప్రమత్తమైన మహాదేవ హుటాహుటిన కుమ్ట స్టేషన్‌ను సంప్రదించారు. అయితే అప్పటికే ఆ రైలు ఆ స్టేషన్‌ను వదిలిపెట్టి, లోపం ఉన్న ప్రమాదకరమైన సెక్షన్ వైపు దూసుకువస్తున్నది. దీంతో మహదేవ వెనుకడుగు వేయకుండా లోకో పైలట్‌ను నేరుగా సంప్రదించేందుకు ప్రయత్నించారు.
కానీ ఆయనతో అనుసంధానం కుదరలేదు. ఇక మహదేవ ఆలస్యం చేయకుండా పట్టాలపై పరుగు ప్రారంభించారు. అర కిలోమీటరు దూరాన్ని కేవలం ఐదు నిమిషాల్లో పరుగెత్తి జెండా ఊపి రైలు నిలిచిపోయేలా చేశారు. ఆయన ప్రయత్నం ఫలించడంతో ఘోర ప్రమాదం తప్పింది. వెల్డింగ్ వర్క్ పూర్తయిన తర్వాత రాజధాని ఎక్స్‌ప్రెస్ కర్వార్ వైపు ప్రయాణం ప్రారంభించింది. మహాదేవ అప్రమత్తంగా ఉండి, తన ప్రాణాలను పణంగా పెట్టి ఘోర ప్రమాదాన్ని నివారించారని అందరూ ప్రశంసించారు. ఆయన వందలాది మంది ప్రాణాలను కాపాడారని రైల్వే అధికారులు కొనియాడారు. కొంకణ్ రైల్వే జోన్ అధికారులు ఆయనకు రూ.15 వేలు నగదు బహుమతి ఇచ్చి సత్కరించారు.