కోల్‌కతా: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం జరిగిన కేసులో (RG Kar rape-murder case) సీల్దాలోని సీబీఐ కోర్టు శనివారం తీర్పు ఇచ్చింది. పోలీస్ వాలంటీర్ అయిన నిందితుడు సంజయ్ రాయ్‌ను దోషిగా నిర్ధారించింది. కోర్టులో ప్రవేశపెట్టిన నిందితుడిని ఉద్దేశించి ‘నీకు శిక్ష పడాలి’ అని న్యాయమూర్తి అన్నారు. శిక్షలను సోమవారం ఖరారు చేస్తామని తెలిపారు.
కాగా, గత ఏడాది ఆగస్టు 9న ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ, ఆసుపత్రిలో రాత్రి విధుల్లో ఉన్న 31 ఏళ్ల జూనియర్ డాక్టర్‌పై హత్యాచార సంఘటన జరిగింది. సివిల్ వాలంటీర్ సంజయ్ రాయ్‌ను ప్రధాన నిందితుడిగా పోలీసులు గుర్తించారు. ఆగస్ట్ 10న అతడ్ని అరెస్ట్ చేశారు. కలకతా హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు దర్యాప్తును సీబీఐ చేపట్టింది. ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్‌ను కూడా సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు.
మరోవైపు దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తిన ఈ కేసులో 120 మంది సాక్షులను సీబీఐ విచారించింది. నిందితుడికి మరణశిక్ష విధించాలని కోర్టులో వాదించింది. జనవరి 9న ఈ కేసులో వాదనలు పూర్తయ్యాయి. దీంతో సీల్దాలోని సీబీఐ కోర్టు శనివారం తీర్పు ఇచ్చింది. నిందితుడు సంజయ్ రాయ్‌ను దోషిగా నిర్ధారించింది. సోమవారం శిక్షలు ఖారారు చేస్తామని కోర్టు వెల్లడించింది.