West Bengal Doctor Case | కోల్కతా ఆర్జీ కార్ దవాఖాన మెడికల్ కాలేజీ వైద్యురాలిపై లైంగికదాడి, హత్య కేసును సుప్రీంకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఈ నెల 20న చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ సారధ్యంలోని బెంచ్ విచారించనున్నది. ఒకవైపు దేశవ్యాప్త నిరసనలు, మరొకవైపు హెల్త్ కేర్ సర్వీసుల నిలిపివేత నేపథ్యంలో సుప్రీంకోర్టు నిర్ణయానికి ప్రాధాన్యం ఏర్పడింది. కోల్కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ పీజీ ట్రైనీ విద్యార్థిని డ్యూటీలో ఉండగా లైంగిక దాడి, హత్యకు గురయ్యారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. రాష్ట్రాల్లో వైద్యులు ఆందోళన బాట పట్టారు. పౌర సమాజం నిరసనకు దిగారు. ఈ ఘటనలో నిందితులకు తీవ్రమైన శిక్ష విధించాలని, తమకు భద్రత కల్పించాలని వైద్యులు డిమాండ్ చేశారు.
ఇంతకుముందు సుప్రీంకోర్టులో న్యాయవాద వృత్తిలో ఉన్న ఇద్దరు న్యాయవాదులు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ కు లేఖ రాశారు. ఈ ఘటనను సుమోటోగా విచారణకు స్వీకరించాలని కోరారు. ‘క్రూరత్వంతో మూగబోయిన బాధితులకు ఈ కేసులో న్యాయ వ్యవస్థ ద్వారానే న్యాయం జరుగుతుందని యావత్ దేశం చూస్తోంది. ఇతరులకు సేవ చేయడానికి జీవితాన్ని అంకితం చేసిన యువ వైద్యురాలి మరణానికి తగిన న్యాయం చేకూర్చాలి. భవిష్యత్ లో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి’ అని ఆ లేఖలో పేర్కొన్నారు.
మరోవైపు ఈ కేసుపై సీబీఐ దర్యాప్తు చేపట్టింది. ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ కాల్ డేటా, చాటింగ్ వివరాలను పరిశీలిస్తోంది. వరుసగా మూడో రోజు ఆదివారం కూడా సందీప్ ఘోష్ ను విచారించింది. ఇప్పటికే ప్రధాన నిందితుడితోపాటు 20 మందిని సీబీఐ అదుపులోకి తీసుకున్నది. సందీప్ ఘోష్ మొబైల్ ఫోన్ సర్వీసు ప్రొవైడర్ల నుంచి కాల్ డేటా, చాట్ వివరాలను సేకరించడానికి ప్రయత్నిస్తున్నది. ఇతర డాక్టర్ల అభిప్రాయాలను, సందీప్ ఘోష్ వివరణలను సరిపోల్చి చూస్తోంది.