West Bengal | కోల్‌కతా, జూన్ 27 : ఆర్జీకర్ హత్యాచార ఘటనను మరువక ముందే పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. పెండ్లికి నిరాకరించిందన్న అక్కసుతో కోల్‌కతా న్యాయ కళాశాలకు చెందిన 24 ఏండ్ల విద్యార్థినిపై అదే కళాశాల పూర్వ విద్యార్థి, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) విద్యార్థి విభాగం నాయకుడు మరో ఇద్దరు విద్యార్థులతో కలసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. బుధవారం జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించి బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అధికార టీఎంసీ విద్యార్థి విభాగం నాయకుడితోపాటు మరో ఇద్దరు విద్యార్థులను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. అదే రోజు వీరిని కోర్టులో హాజరుపరచగా వీరికి ఐదు రోజుల పోలీసు కస్టడీని కోర్టు విధించింది. కోల్‌కతాలోని ఆర్జీ కర్ వైద్య కళాశాలలో ఆరు నెలల కిత్రం ఓ పీజీ విద్యార్థినిపై జరిగిన హత్యాచార ఘటనను దేశం మరుకముందే కోల్‌కతాలో మరో ఘటన చోటు చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది.
విద్యార్థిని ఫిర్యాదు ప్రకారం లా కాలేజీ క్యాంపస్ లోపల బుధవారం రాత్రి 7.30-10.50 మధ్య ఆమెపై సామూహిక అత్యాచారం జరిగింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇద్దరు విద్యార్థులు, ఓ కళాశాల ఉద్యోగిని అరెస్టు చేశారు. ఆ ఉద్యోగి కళాశాల పూర్వ విద్యార్థి కావడమేగాక తృణమూల్ కాంగ్రెస్ విద్యార్థి విభాగం నాయకుడని పోలీసులు తెలిపారు. పోలీసు వర్గాల కథనం ప్రకారం బుధవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో బాధితురాలు పరీక్షకు సంబంధించిన ఫారాలను నింపేందుకు కళాశాలకు వచ్చింది. ఆమె కాలేజీ యూనియన్ గదిలో కూర్చుని ఫారాలు నింపుతుండగా అక్కడకు వచ్చిన ప్రధాన నిందితుడు కళాశాల ప్రధాన గేటును మూసివేయాలని మిగిలిన ఇద్దరు నిందితులకు చెప్పాడు. క్యాంపస్‌లోని సెక్యూరిటీ గార్డు రూములో ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రధాన నిందితుడు మొనోజిత్ మిశ్రా(21), నిందితులు జయీబ్ అహ్మద్(19), ప్రమీత్ ముఖర్జీ(19)లపై పోలీసులు కేసు నమోదు చేశారు. మిశ్రా తనకు పెళ్లి ప్రతిపాదన చేశాడని, తనకు అప్పటికే వేరే బాయ్‌ఫ్రెండ్ ఉన్న కారణంగా ఆ ప్రతిపాదనను తిరస్కరించానని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
యూనియన్ రూములో ఉన్న తనను నిర్బంధించిన మిశ్రా తనను, తన బాయ్‌ఫ్రెండ్‌ని చంపివేస్తానని, తన తల్లిదండ్రులను అరెస్టు చేయిస్తానని బెదిరించాడని ఆమె తెలిపింది. బలవంతంగా తనను సెక్యూరిటీ గార్డు గదిలోకి తీసుకెళ్లి తనను వివస్త్రను చేసి లైంగికదాడికి పాల్పడ్డాడని ఆమె ఫిర్యాదు చేసింది. ఈ దృశ్యాలను మొబైల్లో వీడియో రికార్డింగు చేసిన ప్రధాన నిందితుడు తనకు సహకరించకపోతే వీడియోను లీక్ చేస్తానని బెదిరించాడని ఆమె పేర్కొన్నారు. ఆ తర్వాత వరుసగా మరో ఇద్దరు తనపై అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు తెలిపింది. నిందితుడి కాళ్లు పట్టుకున్నా తనను కనికరించలేదని వాపోయింది. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించిన పోలీసులు పలువురు సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేశారు. ఘటన జరిగిన ప్రదేశాన్ని తమ అధీనంలోకి తీసుకున్న పోలీసులు ఫోరెన్సిక్ నివేదిక అందిన తర్వాత తదుపరి చర్యలు చేపట్టనున్నారు.
లైంగిక దాడి ఘటనపై జాతీయ మహిళా కమిషన్(ఎన్సీడబ్ల్యూ) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నిర్ణీత కాలవ్యవధిలో దర్యాప్తు పూర్తి చేయాలని ఆదేశించిన ఎన్సీడబ్ల్యూ.. మూడు రోజుల్లో తమకు కార్యాచరణ నివేదికను అందచేయాలని రాష్ట్ర పోలీసులను ఆదేశించింది. బాధిత విద్యార్థినికి పూర్తి స్థాయిలో వైద్య, మానసిక, న్యాయపరమైన సహాయం అందచేయవలసిన అవసరం ఉందని ఎన్సీడబ్ల్యూ చైర్పర్సన్ స్పష్టం చేశారు. బాధితురాలికి భారతీయ నాగరిక్ సురక్షా సంహితలోని సెక్షన్ 396 కింద పరిహారం చెల్లించాలని చైర్పర్సన్ ఆదేశించారు.
న్యాయ విద్యార్థినిపై సామూహిక అత్యాచార ఘటన అధికార టీఎంసీ, ప్రతిపక్ష బీజేపీ మధ్య పరస్పర ఆరోపణల దాడికి దారితీసింది. బాధితురాలికి న్యాయం చేస్తామని, దోషులకు కఠిన శిక్షలు విధించేలా చర్యలు తీసుకుంటామని అధికార టీఎంసీ ఎక్స్ వేదికగా తెలిపింది. మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీతోసహా పలువురు టీఎంసీ నాయకులతో కలసి ప్రధాన నిందితుడు మిశ్రా తీసుకున్న ఫొటోలను ప్రతిపక్ష బీజేపీ సోషల్ మీడియాలో వరుసగా షేర్ చేసింది.